ట్విట్టర్లో 'ఉగ్రవాద' పోస్టులు.. పదిహేనేళ్ల జైలు
అలెగ్జాండ్రి: సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు మద్దతు తెలుపుతూ, దానిపట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ భారీ మొత్తంలో పోస్ట్ లు చేసిన ఓ అమెరికన్ యువకుడికి కోర్టు పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా అతడు చేసిన పని తీవ్రమైన నేరం అని స్పష్టం చేసింది. అలీ షుక్రీ అమిన్(17) అనే కుర్రాడు దాదాపు ఏడువేల ట్విట్టర్ పోస్టులు చేశాడు.
ఈ పోస్ట్‌లలో నేరుగా ఉగ్రవాద సంస్థను కొనియాడటంతోపాటు దానికి ఇప్పటికే మద్దతు తెలిపేవారికి కూడా తన మద్దతు ఉంటుందని, అందిన మేరకు తాను కూడా సహాయం చేస్తానని ప్రకటించాడు. డబ్బు మార్పిడి విషయంలో కూడా సూచనలు సలహాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అమెరికాలో నేరుగా ఉగ్రవాద సంస్థకు సహాయపడి పదిహేనేళ్ల జైలు శిక్షపడిన తొలిముద్దాయి ఈ పదిహేడేళ్ల యువకుడే కావడం విశేషం.