కంటెంట్ ఇస్తే నెలకు రూ. 50వేలు
టాప్ కంటెంట్ రైటర్లకు యూసీవెబ్ ఆఫర్
న్యూఢిల్లీ: చైనా వ్యాపార దిగ్గజం ఆలీబాబా గ్రూప్ సంస్థ యూసీవెబ్ తాజాగా తమ వుయ్ మీడియా ప్లాట్‌ఫాంకి నాణ్యమైన కంటెంట్ అందజేసేవారికి నెలకు కనీసం రూ. 50,000 చెల్లించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత సంవత్సరంలో యూసీ న్యూస్ కోసం అత్యుత్తమ నైపుణ్యం గల 1,000 మంది కంటెంట్ క్రియేటర్స్, రైటర్స్‌ను ఎంపిక చేయనున్నట్లు యూసీ వెబ్ సహ వ్యవస్థాపకుడు హె షియావోపెంగ్ తెలిపారు. వుయ్ మీడియాలో నమోదు చేసుకున్న యూజర్లు తమ సొంత కథనాలు, ఫొటోలు, వీడియోలు మొదలైనవి పోస్ట్ చేయొచ్చు. ఇంటర్నెట్ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్ మొదలైన వాటితో యూసీవెబ్ పోటీపడుతోంది. ఇందులో భాగంగా కంటెంట్ అందించేలా భారత యూజర్లను ప్రోత్సహించేందుకు దాదాపు రూ. 5 కోట్లు కేటాయించింది. రాబోయే రెండేళ్లలో భారత్‌లో కంటెంట్ పంపిణీ కోసం సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది.