న్యూ...టర్న్!
మెట్రో మార్పులు షురూ
అఖిలపక్షం ఆమోదంతో కొత్త రూట్ల ఎంపిక
సిటీబ్యూరో: మెట్రో రైలు ‘న్యూ టర్న్’ తీసుకుంటోంది. దీనికి సంబంధించిన అలైన్మెంట్ మార్పులకు అఖిల పక్ష సమావేశంలో ఆమోదం లభించడంతో ఆయా ప్రాంతాల్లో పనులు ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ, సుల్తాన్ బజార్ ప్రాంతాలలో స్వల్పంగా, పాతనగరంలో 3.2 కి.మీ. మేర మార్పులు చేయనున్న విషయం విదితమే. ఆ రూట్లలో మారనున్న అలైన్‌మెంట్‌పై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిద్ధం చేసిన మ్యాపులు ఇలా ఉన్నాయి...
అసెంబ్లీ వద్ద...
కారిడార్-1 (ఎల్బీనగర్-మియాపూర్) రూట్లో వచ్చే అసెంబ్లీ వద్ద మెట్రో మార్గంలో మార్పులు చేశారు. దీంతో అసెంబ్లీ వెనక వైపు నుంచి మెట్రో మార్గం వెళ్లనుంది. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ (అశోక హోటల్) నుంచి పోలీస్ క్వార్టర్స్-డీజీపీ కార్యాలయం, జూబ్లీహాల్ల వెనక నుంచి- పబ్లిక్ గార్డెన్ ఓపెన్ గ్రౌండ్- తెలుగు విశ్వ విద్యాలయం వద్దనున్న ఖాళీ స్థలం నుంచి-నాంపల్లి మార్గానికి మెట్రో మార్గం కలవనుంది. దీని కోసం 19 పోలీసు క్వార్టర్లను తొలగించాల్సి వస్తుంది.
సుల్తాన్‌బజార్ వద్ద..
చారిత్రక సుల్తాన్ బజార్‌ను పరిరక్షించేందుకు కారిడార్-2 (జేబీఎస్-ఫలక్‌నుమా) రూట్లో వచ్చే మెట్రో మార్గాన్ని ఉస్మానియా మెడికల్ కళాశాల ఓపెన్ గ్రౌండ్ నుంచి కోఠి ఉమెన్స్ కళాశాల ఓపెన్ గ్రౌండ్- తిలక్ పార్క్- బాటా జంక్షన్-బడీచౌడీ మీదుగా మళ్లిస్తున్నారు. ఈ రూట్లో మెట్రో మార్గం 0.7 కి.మీ తగ్గనుంది. తాజా అలైన్మెంట్ మార్పులతో 12 ప్రభుత్వ, 18 ప్రైవేటు భవంతులను నేలమట్టం చేయాల్సి వస్తుంది.
పాతనగరంలో...
జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్-2) రూట్లో మెట్రో మార్గంలో పాతనగరంలో కొన్ని మార్పులు చేశారు. ఈ రూట్లో 3.2 కి.మీ. దూరం పెరగనుంది. సాలార్జంగ్ మ్యూజియం- ముస్లింజంగ్‌పూల్-బహదూర్‌పురా-నెహ్రూ జూపార్క్-కాలాపత్తర్-మిశ్రీగంజ్- జంగంమెట్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో మార్గాన్ని మళ్లించనున్నారు. ఈ మార్పులతో 35 ప్రార్థనా స్థలాలు, 28 అషుర్ఖానాలు,7 దేవాలయాల మనుగడకు ఎటువంటి నష్టం కలగబోదని హెచ్ఎంఆర్ నివేదిక సిద్ధం చేసింది.