alimineti uma madhava reddy
-
నాలుక్కరుచుకున్న ఉమా మాధవరెడ్డి..!
సాక్షి, భువనగిరి : సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి చర్యతో టీఆర్ఎస్ నాయకులు, ఆమె తనయుడు అవాక్కయ్యారు. బొమ్మల రామారం జెడ్సీటీసీ అభ్యర్థిగా ఆమె కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరపున ప్రచారం నిర్వహించిన ఉమా పొరపాటుగా మాట్లాడి నాలుక్కచురుకున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరి అక్కడున్న వారందర్నీ షాక్‌కు గురిచేశారు. పక్కనే ఉన్న సందీప్‌రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నాయకులు కారు గుర్తు అని సూచించడంతో తేరుకున్న ఆమె.. కారు గుర్తుకు ఓటేసి సందీప్‌రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని కోరారు. కాగా, తెలుగుదేశం పార్టీని వీడి గులాబీ గూటికి చేరినా ఉమా మాధవరెడ్డి పాత పార్టీని మరచిపోనట్టున్నారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. (చదవండి : టీడీపీకి ఉమా మాధవరెడ్డి రాజీనామా) -
ఆమె ఎటువంటి డిమాండ్ చేయలేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవకాశాలు వస్తాయో చెప్పలేమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో వీరిద్దని కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మాధవరెడ్డి తనకు ఆత్మీయ మిత్రుడని, ఆయన మన మధ్య లేకపోవటం దురదృష్టకరమన్నారు. నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది మంత్రులయ్యారు కానీ, జిల్లా మొత్తాన్ని పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవరెడ్డి అని ప్రశంసించారు. ఉమామాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎటువంటి డిమాండ్ చేయలేదని వెల్లడించారు. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం సొంత చెల్లి ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబం తనకు ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీయిచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న చాలామందికి సహనం లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా బాగా వెనకపడిన జిల్లా అని, భువనగిరి వరకు ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి జరిగి తీరాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందేలా యాదాద్రిని అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి త్వరలో నీళ్లు ఇస్తామని తెలిపారు. జనవరి నుంచి రైతులకు 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తామని కేసీఆర్ హామీయిచ్చారు. -
టీడీపీకి మరో షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నాయకులు వరుసగా సైకిల్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి లాంటి అగ్రనేతలు టీడీపీ నుంచి బయటకు వచ్చారు. మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కూడా టీడీపీని వదిలిపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి అధికార టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిరువురు మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. టీఆర్ఎస్లో చేరాలని వీరిని సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ఉమా మాధవరెడ్డి, సందీప్‌రెడ్డి పార్టీ మారనున్నారని సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని గతంలో ప్రచారం జరిగింది. స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరలేదని, టీఆర్ఎస్లోకి రమ్మని ఆహ్వానిస్తే ఆలోచిస్తానని ఆమె అప్పుడు చెప్పారు. ఏ పార్టీలో చేరినా, తన కుమారుడి వెంట ఉంటానని ఉమా మాధవరెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. -
పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన పిచ్చోని చేతిలో రాయిలా ఉందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎ.ఉమామాధవరెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు రెండేళ్ల కిందట సీఎం అపాయింట్మెంట్ అడిగితే ఇప్పటిదాకా ఇవ్వలేదన్నారు. మాధవరెడ్డి అంటే అభిమానం అంటూనే ఇబ్బందులు పెట్టే కుట్రలకు సీఎం దిగుతున్నారని దుయ్యబట్టారు. పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని, ఎవరి పొత్తు లేకున్నా టీడీపీ బలం ఏమిటో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. 1983లో స్వయంగా ఎన్టీఆర్ టికెట్ ఇస్తే కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోయారని గుర్తు చేశారు. -
'చంద్రబాబు సీఎం కావడంలో ఆయనదే కీలకపాత్ర'
నల్లగొండ రూరల్: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చిన సమయంలో చంద్రబాబునాయుడుకు అండగా నిలిచి ఆయన ముఖ్యమంత్రి కావడంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కీలకపాత్ర పోషించారని మాధవరెడ్డి సతీమణి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి అన్నారు. నల్లగొండలో నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తమ కుటుంబం మొదటి నుంచీ చంద్రబాబుకు అండగా ఉందన్నారు. మాధవరెడ్డి సహకారంతోనే చంద్రబాబు సీఎం అయ్యారని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తమ కుటుంబం కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు పని చేసిందని చెప్పారు.