alka
-
Alka Mittal: డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు... తొలి మహిళగా
Alka Mittal Successful Journey: అది 1956. భారత ప్రభుత్వం ఓఎన్జీసీకి రూపకల్పన చేసింది. ఆ సంస్థ 65 ఏళ్ల మహోన్నత చరిత్రను రాసుకుంది. ఇప్పుడు... ఆ చరిత్రను ఓ మహిళ తిరగరాసింది. ఇప్పుడు దేశమంతా ఆమెనే చూస్తోంది. ఆమె ఓఎన్జీసీ సీఎండీ డాక్టర్ అల్కా మిట్టల్. డాక్టర్ అల్కా మిట్టల్... ఈ పేరే ఓ రికార్డు. ప్రసిద్ధ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు సీఎండీగా నియమితులయ్యారామె. ఓఎన్జీసీ చరిత్రలో ఒక మహిళ సీఎండీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గత రెండు రోజులుగా వార్తల్లో ప్రధానవ్యక్తిగా నిలిచారామె. ఎవరీ అల్కా మిట్టల్ అని, ఆమె వయసెంత అని, ఇంత పెద్ద బాధ్యతలు చేపట్టగలగడానికి ఆమె ఏం చదువుకున్నారు అనే ప్రశ్నలు గూగుల్‌ని శోధిస్తున్నాయి. ఆమె ఈ నెల ఒకటవ తేదీన అల్కా మిట్టల్‌ను సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించినట్లు సోమవారం ఆ సంస్థ ట్విటర్లో ప్రకటించింది. అదేరోజు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఆమె ఆ బాధ్యతల్లో ఆరునెలల పాటు ఉంటారు. ఒకవేళ ఈలోపు పూర్తిస్థాయిలో సీఎండీ నియామకం జరిగినట్లయితే అప్పటి వరకు ఆమె సీఎండీగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. చదవడం హాబీ డాక్టర్ అల్కా మిట్టల్ వయసు 56. పర్యటనలు, పుస్తక పఠనం, రాయడం అల్కామిట్టల్ హాబీలు. అలా హాబీగా చాలా చదివేశారామె. డెహ్రాడూన్‌లోని ఎంకేపీ పీజీ కాలేజ్ నుంచి 1983లో ఎకనమిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రాజ్‌గురు మహావిద్యాలయ నుంచి ఎంబీఏ (హెచ్ఆర్), ఆ తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా నుంచి బిజినెస్, కామర్స్, కార్పొరేట్ గవర్నెన్స్‌లో 2001లో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. అదీ రికార్డే ప్రస్తుతం ఓఎన్జీసీ సంస్థ చైర్పర్సన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కొత్త బాధ్యతలు చేపట్టడానికి మునుపు 2018 నుంచి ఆమె ఆ సంస్థలో హెచ్ఆర్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ సంస్థలో పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితమైన రికార్డు కూడా ఆమెదే. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ రంగంలో ప్రసిద్ధ సంస్థ ఓఎన్జీసీకి సీఎండీగా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ స్థాయి ఆమెకు ఏ ఒక్కరోజులోనో వచ్చి వాలిన హోదా కాదు. గ్రాడ్యుయేట్ ట్రైనీగా 1985లో ఓఎన్జీసీలో చేరిన అల్కామిట్టల్ మూడున్నర దశాబ్దాలుగా రకరకాల విధులు నిర్వర్తించారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్జీసీ మంగుళూరు పెట్రో కెమికల్స్‌లో బోర్డు మెంబర్‌గా క్రియాశీలకంగా వ్యవహరించారు. అల్కా మిట్టల్ ఉత్తరాది రీజియన్‌కు చెందిన ‘ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్’ ప్రెసిడెంట్‌గా మహిళలకు క్షేమకరమైన పని వాతావరణం కల్పించడానికి అవసరమైన సూచనలు చేశారు. వడోదర, ముంబయి, ఢిల్లీ, జోర్హాత్లలో హెచ్ఆర్ విధులు నిర్వర్తించి ఉన్నారు. ఓఎన్జీసీలో ఆమె చీఫ్ స్కిల్ డెవలప్మెంట్ (సీఎస్డీ)గా అత్యంత క్రియాశీలకంగా పని చేశారు. దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ‘నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్’ ద్వారా స్కిల్ ట్రైనింగ్ ఇప్పించారు. దేశంలో ఉన్న అన్ని ఓఎన్జీసీ శాఖల్లో పని చేసే వాళ్లకు ఒకేరకమైన తర్ఫీదు అవసరం అనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రత్యేక ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేశారు. ఆఫ్‌షోర్ (చమురు నిక్షేపాలను తవ్వి వెలికి తీయడానికి సముద్ర గర్భంలోకి వెళ్లడం) బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించారామె. తొలి తరం మహిళ అల్కా మిట్టల్‌ను సీఎండీగా నియమించడానికి ముందు ఆ సంస్థ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఇద్దరు విధుల్లో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉండడం విశేషం. మహిళలు అన్ని రంగాల్లో విశేషమైన సేవలందిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు. కానీ కంపెనీ హెడ్ హోదాలో మాత్రం నూటికి తొంబై కంపెనీల్లో మగవాళ్లే ఉంటున్నారనేది కాదనలేని సత్యం. మహిళలు ఉద్యోగులుగా సేవలందించడానికే పరిమితమవుతున్నారనే నివేదికలను కాదనలేం. అయితే గ్లాస్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన అతికొద్ది మంది మహిళల జాబితాలో చేరారు అల్కామిట్టల్. మహిళలు పెద్దగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అడుగుపెట్టిన తొలితరం మహిళగా ఆమెను చెప్పుకోవచ్చు. అలాగే సీఎండీగా అల్కా మిట్టల్ నియామకం ద్వారా ఆ కంపెనీ మహిళలు, మగవాళ్లకు సమాన అవకాశాలు కల్పించే ‘ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్’ అనే గౌరవాన్ని దక్కించుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో...తొలి మహిళలు ►విక్కీ హోలబ్, సీఈవో, యూఎస్‌లోని ఆక్సిడెంటల్ పెట్రోలియమ్ ఆయిల్ కంపెనీ ►లిండా కుక్, సీఈవో, నార్త్ సీ ఆయిల్.. ప్రొడ్యూసర్ ప్రీమియర్ ఆయిల్ క్రెసోర్ హోల్డింగ్ ►కేథరీన్ రో, సీఈవో, వెంట్వర్త్ రీసోర్సెస్, టాంజానియా ►మారియానా జార్జ్, సీఈవో, దక్షిణ, తూర్పు యూరప్‌లో అతి పెద్ద ఎనర్జీ కంపెనీ ఓఎమ్వీ పెట్రోమ్ ఆఫ్ ఆస్ట్రియా ►మనదేశంలో అల్కామిట్టల్కంటే ముందు ఈ రంగంలో నిషి వాసుదేవ రికార్డు సృష్టించారు. ఆమె 2014 మార్చిలో హిందూస్థాన్ పెట్రోలియమ్ కంపెనీలో కీలక బాధ్యతలను స్వీకరించారు. చదవండి: మంచు ఖండంలో మెరిసిన వజ్రం -
సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్
సాధారణంగా గోల్డ్ ఫాయిల్‌ను ఉపయోగించి తంజావూరు పెయింటింగ్స్‌ను డిజైన్ చేస్తారు. అయితే హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉంటున్న నిఖిత, అల్కాలు సిల్వర్ ఫాయిల్‌ను ఉపయోగించి, కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. వైకుంఠపాళీ, అష్టాచెమ్మా, లూడో వంటి గేమ్ బోర్డులను సిల్వర్ ఫాయిల్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దేవతామూర్తులు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్ క్లాక్‌లు, వాల్ ఫ్రేమ్స్, హ్యాంగింగ్స్.. ప్రతీ డిజైన్ వెండివెన్నెలలా చూపరులను ఆకట్టుకునేలా డిజైన్ చేస్తూ, వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇద్దరూ దూరపు బంధువులు. వరసకు అక్కాచెలెళ్లు. ఇద్దరూ గృహిణులుగా తమ తమ ఇంటి బాధ్యతలను చక్కబెట్టుకుంటూ, పిల్లల పనులు చూసుకుంటున్నారు. ‘ఎన్ని పనులున్నా మనలోని అభిరుచికి మెరుగులు దిద్దుకోవాల్సింది మనమే. అందుకే, కొంత సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం’ అని వివరించారు ఈ కజిన్స్. రోజూ ఎనిమిది గంటలు నిఖిత, అల్కా ఇద్దరూ బి.కామ్ డిగ్రీ పూర్తి చేశారు. ‘ఆసక్తి కొద్దీ ఆభరణాల తయారీ కోర్సు చేశాను’ అని చెప్పిన నిఖిత పదేళ్ల పాటు అందమైన ఆభరణాలను రూపుకట్టారు. ‘దాదాపు వందకు పైగా ఎగ్జిబిషన్లలో నా ఆభరణాలను ప్రదర్శించాను. కరోనా సమయంలో మాత్రం కొత్తగా ఆలోచించాలనుకున్నాను. ఇంటి నుంచే కొత్త వర్క్ తో నా ప్రెజెంటేషన్ ఉండాలనుకున్నాను. అప్పుడే సిల్వర్ ఫాయిల్ ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని అల్కాతో చర్చించినప్పుడు మంచి ఆలోచన అంది. తంజావూర్ పెయింటింగ్స్‌లో గోల్డ్ ఫాయిల్‌ను ఉపయోగిస్తారు. అది ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకే మేం సిల్వర్ ఫాయిల్ గురించి ఆలోచించాం. దీంతో ఇద్దరం సిల్వర్ ఫాయిల్‌తో రకరకాల ఫ్రేమ్స్ తయారు చేశాం. వీటిని మిగతా వేటి వేటికి జత చేయచ్చో ఒక ప్లాన్ వేసుకున్నాం. కలపకు సిల్వర్ ఫాయిల్‌ను జత చేస్తూ చాలా ప్రయోగాలే చేశాం. జ్యువెలరీ బాక్సులు, వాచీలు, గేమ్ బోర్డులు.. ప్రతీది ప్రత్యేకం అనిపించేలా డిజైన్ చేశాం’ అని వివరించింది నిఖిత. ‘ఈ వర్క్ లో ఇద్దరం గంటల గంటల సమయం కేటాయించాం. అందుకు మా కుటుంబాలు కూడా సపోర్ట్‌గా ఉన్నాయి. ఫ్రేమ్స్‌కు నాలుగైదు రోజుల సమయం సరిపోతుంది. కానీ, గేమ్ బోర్డులకు పది నుంచి ఇరవై రోజులైనా సమయం పడుతుంది. దాదాపు రోజూ ఎనిమిది నుంచి పది గంటలైనా వీటి తయారీకి కేటాయిస్తాం’ అని తమ వర్క్ గురించి వివరించింది అల్కా. ప్రత్యేకమైన కానుకలు ‘మేం చేసే డిజైన్స్‌లో మరోదాన్ని పోలిన డిజైన్ ఉండదు. దేనికది ప్రత్యేకం. పెళ్లి్ల, పుట్టినరోజు, గృహప్రవేశాలు వంటి వేడుకలకు ఏదైనా కానుక తీసుకెళ్లాలనుకుంటారు. అదే సమయంలో కానుక తీసుకున్నవాళ్లు ఇంట్లో తీపి జ్ఞాపకంగా అలంకరించుకోవాలనుకుంటారు. ఎన్నేళ్లయినా ప్రత్యేకంగా ఉండే సిల్వర్ ఫాయిల్‌తో డిజైన్స్ తీసుకు రావాలనుకున్నాం. మేం ‘నకాషి’ పేరుతో మా బ్రాండ్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ డిజైన్స్‌లో స్వరోస్కి, జెమ్స్ కూడా ఉపయోగిస్తాం. డిజైన్, సైజును బట్టి ధరలు ఉంటాయి. పెట్టుబడి ఇద్దరిది, రాబడి ఇద్దరిదీ’ అంటూ కలిసి పనిచేస్తే కలిగే లాభం గురించి, పంచుకున్న పని రోజుల గురించి ఆనందంగా తెలిపారు ఈ సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్. – నిర్మలారెడ్డి -
ఎలుకలు కొరికాయి...రూ.10లక్షలు చెల్లించండి
రాంచి: రైలులో ఎలుకల స్వైర విహారం వివాదాన్ని సృష్టించింది. రాంచీ నుంచి హౌరా వెళ్లేందుకు గాను రిటైర్డ్ ఛీప్ ఇంజనీర్ పీసీ సిన్హా , అతని భార్య అల్కా గత ఏడాది డిసెంబర్ 30 న టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో సుఖంగా ప్రయాణం చేద్దామనుకున్న ఈ సీనియర్ దంపతులు మూషికాలతో అష్టకష్టాలు పడ్డారు. సుఖం, సౌకర్యం మాట దెవుడెరుగు చివరకు ఆసుపత్రి మెట్లుఎక్కి, టీకాలు వేయించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే ... బొకారో స్టీల్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయిన సిన్హా, ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అల్కా టికెట్స్ బుక్ చేసుకుని రైలు ఎక్కారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆ బోగీలోని ప్రయాణీకులకు కంటిమీద కునుకు కరువైంది. కంపార్ట్మెంట్లో ఎక్కడ చూసిన ఎలుకల మయం. ఎలుకల విసర్జకాలతో దుర్గంధపూరితంగా తయారైంది అక్కడి వాతావరణం. అక్కడితో వీరి కష్టాలు ఆగిపోలేదు. దొరికిని వారిని దొరికినట్టు ఎలుకలు కొరికేయడం మొదలుపెట్టాయి. దీంతో సిన్హాతో పాటు మరో నలుగురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎలుకల సంచారంతో పరిస్థితి అంతా గజిగజి గందరగోళంగా తయారవ్వడంతో సత్రంగంజ్ స్టేషన్లో దాదాపు అరగంటసేపు రైలును ఆపివేశారు. ఈ క్రమంలో సిన్హా దంపతులు గ్రీవియెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. రైల్వే శాఖ సిబ్బంది నిర్వాకం వల్ల తమకు కలిగిన అసౌకర్యానికి గాను 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. హై క్లాస్ బోగీల్లో ఎలుకల స్వైర విహారంపై సిన్హా మండిపడ్డారు. తన జీవితంలో ఇంత పెద్ద ఎలుకల్ని ఎక్కడా చూడాలేదని ఆయన అన్నారు. ఒకవైపు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ గురించి విస్రృతంగా ప్రచారం చేస్తోంటే, మరోవైపు రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఎలుకల కాటు వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. అసలే డయాబెటిక్ రోగినైన తనను ఎలుకలు 3 మిల్లీమీటర్ల మేర కొరికి పారేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి కోలకత్తా చేరిన తరువాత రాబిస్ టీకాలు వేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికీ రైళ్లను శుభ్రంగా ఉంచడం తెలియని ప్రభుత్వాలు బుల్లెట్ ట్రెయిన్ల కోసం కలలు కంటున్నాయని సిన్హా భార్య అల్కా మండిపడ్డారు. సిన్హా దంపతుల ఫిర్యాదును పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆగ్నేయ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ఇంకా తనకు సమాచారం అందలేదని, ఫిర్యాదు అందిన అనంతరం అవసరమైన చర్యలను తీసుకుంటామని రాంచి డివిజనల్ రైల్వే మేనేజర్ దీపక్ కుమార్ చెప్పారు.