ఎలుకలు కొరికాయి...రూ.10లక్షలు చెల్లించండి
ఎలుకలు కొరికాయి...రూ.10లక్షలు చెల్లించండి
Published Wed, Jan 6 2016 4:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM
రాంచి: రైలులో ఎలుకల స్వైర విహారం వివాదాన్ని సృష్టించింది. రాంచీ నుంచి హౌరా వెళ్లేందుకు గాను రిటైర్డ్ ఛీప్ ఇంజనీర్ పీసీ సిన్హా , అతని భార్య అల్కా గత ఏడాది డిసెంబర్ 30 న టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో సుఖంగా ప్రయాణం చేద్దామనుకున్న ఈ సీనియర్ దంపతులు మూషికాలతో అష్టకష్టాలు పడ్డారు. సుఖం, సౌకర్యం మాట దెవుడెరుగు చివరకు ఆసుపత్రి మెట్లుఎక్కి, టీకాలు వేయించుకోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే ... బొకారో స్టీల్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయిన సిన్హా, ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అల్కా టికెట్స్ బుక్ చేసుకుని రైలు ఎక్కారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆ బోగీలోని ప్రయాణీకులకు కంటిమీద కునుకు కరువైంది. కంపార్ట్మెంట్లో ఎక్కడ చూసిన ఎలుకల మయం. ఎలుకల విసర్జకాలతో దుర్గంధపూరితంగా తయారైంది అక్కడి వాతావరణం. అక్కడితో వీరి కష్టాలు ఆగిపోలేదు. దొరికిని వారిని దొరికినట్టు ఎలుకలు కొరికేయడం మొదలుపెట్టాయి. దీంతో సిన్హాతో పాటు మరో నలుగురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎలుకల సంచారంతో పరిస్థితి అంతా గజిగజి గందరగోళంగా తయారవ్వడంతో సత్రంగంజ్ స్టేషన్లో దాదాపు అరగంటసేపు రైలును ఆపివేశారు. ఈ క్రమంలో సిన్హా దంపతులు గ్రీవియెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. రైల్వే శాఖ సిబ్బంది నిర్వాకం వల్ల తమకు కలిగిన అసౌకర్యానికి గాను 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు.
హై క్లాస్ బోగీల్లో ఎలుకల స్వైర విహారంపై సిన్హా మండిపడ్డారు. తన జీవితంలో ఇంత పెద్ద ఎలుకల్ని ఎక్కడా చూడాలేదని ఆయన అన్నారు. ఒకవైపు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ గురించి విస్రృతంగా ప్రచారం చేస్తోంటే, మరోవైపు రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఎలుకల కాటు వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. అసలే డయాబెటిక్ రోగినైన తనను ఎలుకలు 3 మిల్లీమీటర్ల మేర కొరికి పారేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి కోలకత్తా చేరిన తరువాత రాబిస్ టీకాలు వేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికీ రైళ్లను శుభ్రంగా ఉంచడం తెలియని ప్రభుత్వాలు బుల్లెట్ ట్రెయిన్ల కోసం కలలు కంటున్నాయని సిన్హా భార్య అల్కా మండిపడ్డారు.
సిన్హా దంపతుల ఫిర్యాదును పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆగ్నేయ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ఇంకా తనకు సమాచారం అందలేదని, ఫిర్యాదు అందిన అనంతరం అవసరమైన చర్యలను తీసుకుంటామని రాంచి డివిజనల్ రైల్వే మేనేజర్ దీపక్ కుమార్ చెప్పారు.
Advertisement