బెస్ట్ డీలర్ గా వరుణ్ మోటార్స్
♦ మారుతి సుజుకి ప్రతిష్టాత్మక అవార్డు
♦ వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఏటా ఇచ్చే ఆల్ ఇండియా బెస్ట్ పెర్ఫార్మెన్స్ డీలర్ అవార్డు వరుణ్ మోటార్స్‌కు వరిం చింది. దేశవ్యాప్తంగా 450 మంది డీలర్లు పోటీపడగా వరుణ్ మోటార్స్ విజేతగా నిలిచింది. విక్రయాలు, సేవలు, ఫైనాన్స్, యాక్సెసరీస్, ట్రూ వాల్యూ షో రూంలు, డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డీలర్‌కు ఈ అవార్డు ఇస్తారని వరుణ్ మోటార్స్ ఎండీ వి.వరుణ్ దేవ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు.
2015-16లో మొత్తం ఏడు అవార్డులను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. భారత్‌లో ఈ ఏడాది మారుతి సుజుకి టాప్-4 డీలర్‌గా నిలవడమే లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ మోటార్స్ టాప్-5 డీలర్‌గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 27,000 కార్లను విక్రయించింది. మారుతి సుజుకి అమ్మకాల్లో వరుణ్ మోటార్స్ వాటా 2.2 శాతం.
భారీగా వ్యాపార విస్తరణ..: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వరుణ్ గ్రూప్ ఇటీవలే బెంగళూరులో మారుతి షోరూంతో అడుగు పెట్టింది. త్వరలో మరో షోరూంతోపాటు నెక్సా ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 7 రూరల్ ఔట్లెట్లను తెరుస్తోంది. 2016-17లో 31,000 కార్ల విక్రయం లక్ష్యమని వరుణ్ దేవ్ వెల్లడించారు. వరుణ్ మోటార్స్ విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ కంపెనీలవి నెలకు 11,500 కార్లు అమ్ముడవుతున్నాయి.
ఇందులో మారుతి సుజుకి వాటా 5,000 యూనిట్లు. వరుణ్ మోటార్స్ గ్రూప్ విస్తరణకుగాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.160 కోట్లు వెచ్చిస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద రూ.25 కోట్లతో నిర్మిస్తున్న సర్వీస్ అపార్ట్మెంట్లు నెల రోజుల్లో సిద్ధం కానున్నాయి. అలాగే విజయవాడలో రూ.200 కోట్లతో ఏర్పాటవుతున్న 268 గదుల స్టార్ హోటల్ 2018లో ప్రారంభం కానుంది. కాగా, మీడియా సమావేశంలో వరుణ్ మోటార్స్ గ్రూప్ ఈడీ వి.ఆర్.సి.రాజు, డెరైక్టర్ డి.కె.రాజు, జీఎం నీరజ్ పాల్గొన్నారు.