ఆమె తప్ప అందరూ సిస్టర్సే!
‘‘భారతీయులందరూ నా సోదరీసోదరులు. కానీ, ఒక్క అమ్మాయి తప్ప’’ అని అంటున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన హీరోగా రూపొందుతున్న ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప’ అనే చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ- ‘‘తన లవ్‌స్టోరీ కోసం హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే కథాంశంతో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘ఈ కథను మూడేళ్ల క్రితమే సందీప్‌కు చెప్పాను. ఈ నెల 10న షూటింగ్ ప్రారంభించి, డిసెంబరులో పూర్తి చేస్తాం. కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, సంగీతం: మిక్కీ జె మేయర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆళ్ల రాంబాబు.