‘బీ థర్మల్’ విస్తరణపై ప్రభుత్వానికి నివేదించండి
ఎస్ఈకి అఖిలపక్ష కమిటీ వినతి
రామగుండం : పట్టణంలోని 62.5 మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణకు గల అనుకూలతలను ప్రభుత్వానికి నివేదించాలని అఖిలపక్ష కమిటీ నాయకులు జెన్కో ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ శంకరయ్యకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ కన్నూరి సతీశ్‌కుమార్ మాట్లాడారు. రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయమనే భావనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కేంద్రం విస్తరణపై ప్రకటన చేసేవరకూ దశలవారీగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతమైన ఉద్యమం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం జెన్కో ఆధ్వర్యంలో పలుచోట్ల విద్యుత్ కేంద్రాల స్థాపనకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, భూసేకరణ సమస్య, వనరుల లభ్యత తదితర అంశాలకు రామగుండం భిన్నంగా ఉంటుందన్నారు. స్థానిక విద్యుత్ కేంద్రం స్థాపనకు ప్రభుత్వ భూమి అనువుగా ఉందని, వనరులు సమృద్ధిగా ఉన్నాయని, సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు, రాజీవ్‌రహదారి, రైల్వేలైన్ తదితర అంశాలు ఉత్పత్తి కేంద్రం స్థాపనకు అనువుగా ఉంటుందని నివేదికలు సైతం రూపొందించారన్నారు.
రాజకీయ ఒత్తిళ్లతోనే మరోచోట ప్రతిపాదనలు చేస్తున్నారని, వీటన్నింటిని ప్రభుత్వం పక్కన పెట్టి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందుకు ఇచ్చిన హామీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. జెన్కో ఎస్ఈ మాట్లాడుతూ స్థానిక పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు గుర్రాల నర్సింహులు, దండగట్ల శ్రీనివాస్, గోలి నాగమల్లు, సంజీత్పాషా, కమిటీ సభ్యులు పూదరి శ్రీనివాస్, గూడూరి లవణ్‌కుమార్, అజ్మత్‌అలీ, గోలివాడ ప్రసన్నకుమార్, గట్టు శ్రీనివాస్, చిలుక రామ్మూర్తి, ప్రణయ్, గురునాథ్, మహేందర్, రవి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.