all partys demand
-
ప్రత్యేక హోదాసాధనకు ఐక్య ఉద్యమం
అనంతపురం టౌన్ : ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే ధ్యేయంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఐక్యంగా పోరాటం చేయాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఆది వారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు మార్చి 6న రాజీనామా చేయనున్నట్లు ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనను ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు. టీడీపీ ఎంపీలు సైతం రాజీనామా చేయడంతోపాటు కేంద్ర కూటమి నుంచి బయటకు వచ్చి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక హోదా నవ్యాంధ్రకు సంజీవని అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం నియోజకవర్గ సమన్వయ కర్త నదీమ్ అహమ్మద్ మాట్లాడుతూ ప్రత్యేక హోద సాధనే ధ్యేయంగా నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసుకు బయపడి చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రంలో తాకట్టు పెట్టారన్నారు. అందులో భాగంగానే సినీహీరో పవణ్కళ్యాన్ను అడ్డుపెట్టుకొనిజేఎఫ్ఎఫ్సీ పేరిట మరో డ్రామాకు తెరలేపారన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అవసరం :సీపీఎం ఉత్తర జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమమో... వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సైతం ముఖ్యమేనన్నారు. విభజన హామీలు అమలే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి స్థలాన్ని సేకరించి, ఏళ్లు గడుస్తోందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి బడ్జెట్లో కేటాయించిన రూ.10 కోట్లతో ప్రహరీ కూడా నిర్మించలేదన్నారు. మానవహక్కుల వేధిక నాయకుడు బాషా మాట్లాడుతూ గతంలో చేసిన తప్పిదాలనే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ చేస్తోందన్నారు. ఇదే జరిగితే ప్రాంతీయ అసమానతలు పెరిగి మరో విభజనకు నాంధీ పలుకుతుందన్నారు. కాంగ్రెస్ నేత దాదా గాంధీ మాట్లాడుతూ విభజన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం తుంగలో తొక్కేసిందన్నారు. విభజన హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో అందోళనలు చేపట్టడానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి, పసుపుల బాలకృష్ణారెడ్డి, సీపీఐ నాయకులు నారాయణస్వామి, లింగమయ్య, శ్రీరాములు, సీపీఎం నాయకులు నాగేంద్ర కుమార్, కాంగ్రెస్ నాయకులు కేవీ రమణ, సీఎఎంఎల్ నాయకులు పెద్దన్న, ఆర్పీఎస్ఎస్ శ్రీరాములు, ఎస్ఆర్ నాగభూషణం, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కేశవరెడ్డి, వీకే రంగారెడ్డితోపాటు విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలి
‘పురుషోత్తపట్నం’పై అఖిలపక్షం డిమాండ్ 2013 భూసేకరణ చట్ట సవరణలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి నిర్ణయం చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ దేవీచౌక్ (రాజమహేంద్రవరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, భూసేకరణ చట్టం–2013ను యథాతథంగా అమలు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యాన ఆనం రోటరీ హాలులో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు, రైతులు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ విధానాన్ని ఎండగట్టారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా, ఇసుక దందాలు, భూకబ్జాలు, ఏవేవో పరిశ్రమల పేరిట విలువైన భూములను అస్మదీయులకు కట్టబెట్టడం నిత్యకృత్యంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో దోపిడీదారీ వ్యవస్థ నడుస్తోందని, ప్రభుత్వమే చట్టాలను నీరుగారుస్తోందని అన్నారు. రైతుల కోసం ఎటువంటి ఉద్యమానికైనా తాము సిద్ధమని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, రైతుల అంగీకారంతో మాత్రమే భూములు తీసుకోవాలని, పరిశ్రమల స్థాపనకు పర్యావరణ, సామాజిక అంశాలను అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం, పట్టిసీమ రెండూ బోగస్ ప్రాజెక్టులేనని, ఎన్నికల తరువాత అవి ఉండవని అన్నారు. రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాలని, పది రూపాయలు ఎక్కువిచ్చినా తప్పు లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కొందరు ‘పెద్దలు’ పోలవరం కుడి కాలువ పనులను న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ‘‘పురుషోత్తపట్నం ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని నాయకులు చెబుతున్నారు. అయితే కేంద్ర జలవనరుల సంఘం నాడు ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు’’ అని ఆయనన్నారు. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో జరుగుతున్న అవినీతిని గురించి తాను ఎన్ని ఉత్తరాలు రాసినా, చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానం లేదని ఉండవల్లి అన్నారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరిత ధోరణి అవంబిస్తోందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత మాత్రమే భూములు సేకరించాలని, భూములు కోల్పోయినవారికి మార్కెట్ ధరను అనుసరించి పరిహారం ఇవ్వడంతో పాటు ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణల ద్వారా ప్రజాభిప్రాయానికి తిలోదకాలివ్వడం, నష్టపరిహారానికి చట్టబద్ధత కల్పించకపోవడం, పోలీసుల ద్వారా రైతులను భయభ్రాంతులను చేయాలనుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కాంట్రాక్టర్లకు, అధికార పక్షం నాయకులకు, కార్యకర్తలకు లబ్ధి కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అక్రమ సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి మించిన బలమైన శక్తి లేదన్న విషయం గుర్తుచుకోవాలని అన్నారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం నేత టి.అరుణ్ తదితరులు ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం నçష్టపరిహారం ఇవ్వాలని, ఏప్రిల్ మూడో తేదీన అఖిలపక్ష నాయకులతో, పురుషోత్తపట్నం రైతులతో సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ¯ŒSవీ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్, ఉభయ గోదావరి జిల్లాల వర్తక సమాఖ్య ప్రతినిధి నందెపు శ్రీనివాస్, గోలి రవి, పురుషోత్తపట్నం నిర్వాసిత రైతు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల కడుపు కొట్టొద్దు 2013 భూసేకరణ చట్టానికి చేసిన సవరణలను రద్దు చేయాలి. చట్టాలను దుర్వినియోగం చేసి, రైతుల కడుపు కొట్టొద్దు. మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. బలవంతంగా భూములు తీసుకునే పద్ధతి విడనాడాలి. – కలగర బాలకృష్ణ, రైతు, పురుషోత్తపట్నం అయోమయంలో రైతులు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రైతుల పరిస్థితి అయోమయంలో ఉంది. నావి రెండున్నర ఎకరాలు పోయాయి. భూములకు పరిహారం ఎంతిస్తారో, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి దాపురించింది. నాకు వ్యవసాయం తప్ప మరో బతుకుతెరువు లేదు. – చెరుకూరి పోసిబాబు, రైతు కోర్టు తీర్పునుపట్టించుకోవడంలేదు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో 30 సెంట్ల భూమి కోల్పోయాను. భూమి ఇవ్వనని రాతపూర్వకంగా తెలియజేశాను. న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. 2013 చట్టాన్ని అమలు చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పులను పట్టించుకోవడం లేదు. – గద్దే రామకృష్ణ, చినకొండేపూడి, సీతానగరం మండలం వక్రభాష్యాలు చెబుతున్నారు న్యాయస్థానం పిటిష¯ŒSను డిస్పోజ్ చేశామని చెబితే, డిస్మిస్ చేసిందని అధికారులు చెబుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం? 788 జీఓ ప్రకారం పట్టిసీమ రైతులకు ఇచ్చినవిధంగానే నష్టపరిహారం చెల్లించాలి. – రమేష్‌బాబు, పట్టిసీమ -
కార్మికుల సమస్యపై అసెంబ్లీలో చర్చ
అఖిలపక్ష నేతల డిమాండ్ పేపరు మిల్లు కార్మికులకు అండగా ఉంటామని భరోసా కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : ఇంటర్నేషనల్ పేపరు మిల్లు కార్మికుల సమస్యను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని విమర్శించారు. తొలగించిన 33 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుని, తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ పేపరు మిల్లు కార్మికులు 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేపరు మిల్లు ఎదురుగా ఉన్న కల్యాణ మండపంలో అఖిలపక్ష నాయకులు మంగళవారం సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ వారికి అఖిలపక్షం అండగా ఉంటుందని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంత శ్రీహరి, 31వ డివిజన్ ఇన్‌ఛార్జి మజ్జి అప్పారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, వామపక్ష నాయకులు టి.అరుణ్, మీసాల సత్యనారాయణ, నల్లా రామారావు, పేపరు మిల్లు కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు. సీఎం కార్యాలయ దన్నుతోనే.. వివాదాన్ని పరిష్కరించే ఆలోచనలో మిల్లు యాజమాన్యం ఉన్నట్టు కనిపించడం లేదని నాయకులు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి అధికార పార్టీ జోక్యం అనివార్యమని స్పష్టం చేశారు. 13 రోజులుగా ఆందోళన చేస్తున్నా, మిల్లు యాజమాన్యం దిగిరాకపోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి యాజమాన్యానికి అండదండలు ఉండడమే కారణమని చెప్పారు. కొంతమంది కార్మిక నేతలు యాజమాన్యానికి కోవర్టులుగా వ్యవహరించడం వల్ల పోరాటం బలహీనపడుతోందని తెలిపారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాల్సి వస్తోందని, దీని ప్రభావంపై కార్మిక సంఘాలు ఆలోచించుకోవాలని చెప్పారు. ఉద్యమంలో భాగంగా కార్మికులు తమ కుటుంబ సభ్యులతో మిల్లు ఎదుట ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అఖిలపక్షం తరఫున అన్ని పార్టీలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.