రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లాకార్యదర్శి జగదీష్
అనంతపురం టౌన్ : ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే ధ్యేయంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఐక్యంగా పోరాటం చేయాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఆది వారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు మార్చి 6న రాజీనామా చేయనున్నట్లు ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు. టీడీపీ ఎంపీలు సైతం రాజీనామా చేయడంతోపాటు కేంద్ర కూటమి నుంచి బయటకు వచ్చి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక హోదా నవ్యాంధ్రకు సంజీవని అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ రాజీలేని పోరాటం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం నియోజకవర్గ సమన్వయ కర్త నదీమ్ అహమ్మద్ మాట్లాడుతూ ప్రత్యేక హోద సాధనే ధ్యేయంగా నాలుగేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటాలు చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసుకు బయపడి చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రంలో తాకట్టు పెట్టారన్నారు. అందులో భాగంగానే సినీహీరో పవణ్‌కళ్యాన్‌ను అడ్డుపెట్టుకొనిజేఎఫ్‌ఎఫ్‌సీ పేరిట మరో డ్రామాకు తెరలేపారన్నారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అవసరం :సీపీఎం ఉత్తర జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమమో... వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సైతం ముఖ్యమేనన్నారు. విభజన హామీలు అమలే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి స్థలాన్ని సేకరించి, ఏళ్లు గడుస్తోందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి బడ్జెట్‌లో కేటాయించిన రూ.10 కోట్లతో ప్రహరీ కూడా నిర్మించలేదన్నారు.
మానవహక్కుల వేధిక నాయకుడు బాషా మాట్లాడుతూ గతంలో చేసిన తప్పిదాలనే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ చేస్తోందన్నారు. ఇదే జరిగితే ప్రాంతీయ అసమానతలు పెరిగి మరో విభజనకు నాంధీ పలుకుతుందన్నారు. కాంగ్రెస్ నేత దాదా గాంధీ మాట్లాడుతూ విభజన హామీలను ఎన్‌డీఏ ప్రభుత్వం తుంగలో తొక్కేసిందన్నారు. విభజన హామీల అమలుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో అందోళనలు చేపట్టడానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి, పసుపుల బాలకృష్ణారెడ్డి, సీపీఐ నాయకులు నారాయణస్వామి, లింగమయ్య, శ్రీరాములు, సీపీఎం నాయకులు నాగేంద్ర కుమార్, కాంగ్రెస్ నాయకులు కేవీ రమణ, సీఎఎంఎల్ నాయకులు పెద్దన్న, ఆర్‌పీఎస్‌ఎస్ శ్రీరాములు, ఎస్‌ఆర్ నాగభూషణం, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కేశవరెడ్డి, వీకే రంగారెడ్డితోపాటు విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment