దర్శనం టికెట్లు.. ఇక ఆన్లైన్లోనే!
సాక్షి,తిరుమల: సర్వదర్శనం, కాలిబాట దర్శనం, రూ.300 టికెట్ల ఆన్లైన్ దర్శనం, రూ.50 సుదర్శనం, ఆర్జిత సేవల దర్శనం.. ఇలా రోజుకు 60 వేలలోపే భక్తులను అనుమతించే వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించే విషయంపై టీటీడీ కసరత్తు చేస్తోంది. అన్ని సేవలకు కూడా ఆన్లైన్లో టికెట్లు కేటాయించి నిర్ణయించిన సమయానికే భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
20 వేలకు పెరగనున్న రూ.300 టికెట్ల కోటా
ప్రస్తుతం రూ.300 టికెట్ల ఆన్లైన్ దర్శనం సజావుగా సాగుతోంది. రో జుకు మొత్తం 18 వేల టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. ఒక రోజు ముందు వేయి టికెట్లు, 14 రోజుల ముందు ఏడు వేలు , 28 రోజుల ముందు పది వేల టికెట్లు ఇస్తున్నారు. వీటిని ఆన్లైన్లో పది వేలు, టీటీడీ ఈదర్శన్ కౌంటర్లలో మూడు వేలు, పోస్టాఫీసుల్లో ఐదు వేల చొప్పున భక్తులకు కేటాయిస్తున్నారు. అత్యల్పంగా రోజూ 50 శాతం నుంచి 90 శాతం వరకు టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఐదారుశాతం మినహా భక్తులు స్వామి దర్శనానికి హాజరవుతున్నారు. ఇదే పద్ధతిలోనే మరో రెండు వేల టికెట్లు కలిపి రోజుకు మొత్తం 20 వేల టికెట్లను ఆన్లైన్లో కేటాయించాలని టీటీడీ సంకల్పించింది.
రూ.300కు పెరగనున్న రూ.50 సుదర్శనం టికెట్లు?
ప్రస్తుతం రోజుకు ఐదు వేల వరకు రూ.50 సుదర్శనం టికెట్లను ఇంటర్నెట్ ద్వారా భక్తులకు టీటీడీ కేటాయిస్తోంది. వీరికి దర్శనంతోపాటు రెండు లడ్డూలు ఉచితంగా అందజేస్తున్నారు. తక్కువ ధరతో టికెట్లు తీసుకోవడంతో భక్తుల గైర్హాజరీ శాతం పెరుగుతోంది. దీంతో టికెట్లు లభించని ఇతర భక్తులు దర్శనం కోల్పోయే పరిస్థితి ఉంది. దీన్ని గుర్తించిన టీటీడీ రూ.50 సుదర్శన టికెట్లను రద్దుచేసి ఇదే కోటాలోని ఐదువేల టికెట్లును రూ.300 ఆన్లైన్లోకి కలిపి భక్తులకు విక్రయించాలని భావిస్తోంది.
కొత్త మార్పులకు టీటీడీ ఈవో, జేఈవో యోచన
భక్తులందరికీ సంతృప్తికర దర్శనం కల్పించేందుకు అన్ని క్యూల నుంచి రోజుకు 60 వేలు మించకుండా అనుమతించే విషయంపై టీటీడీ ఈవో, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్వ దర్శనానికి భక్తులను రద్దీని బట్టి రోజుకు సుమారు 20 నుంచి 25 వేల మంది, కాలిబాటల్లో 10 నుంచి 15 వేల మందికి దర్శనానికి వస్తున్నారు. వీరికి కూడా దర్శన విషయాల్లో నిర్ణీత సమయం కేటాయించే కొత్త పద్ధతులు, నూతన విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.