తీర గస్తీకి ఆల్ టెరైన్ వాహనాలు
విశాఖలో రాష్ట్ర కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తీర ప్రాంత గస్తీ కోసం కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు ఆల్ టెరైన్ (అన్ని భౌగోళిక పరిస్థితులకు అనువైన) వాహనాలను కొనుగోలు చేయనున్నారు. ఇద్దరు సిబ్బంది కూర్చునే వీలున్న ఈ వాహనాలను ప్రస్తుతం చెన్నై పోలీసులు బీచ్ పెట్రోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. వీటిని పరిశీలించిన కోస్టల్ సెక్యూరిటీ ఐజీ జి.సూర్యప్రకాశ్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో కేంద్ర నిధులతో 4 వాహనాలను కొనుగోలు చేయనున్నారు.
మైనర్ పోర్టుల భద్రతకు స్టేట్ మారిటైమ్ బోర్డ్: రాష్ట్రంలో విశాఖపట్నం మినహా మిగిలిన పోర్టులన్నీ మైనర్ పోర్టుల జాబితాలోకే వస్తాయి. విశాఖ పోర్టు రక్షణ బాధ్యతల్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షిస్తుండగా మిగిలిన వాటికి సరైన వ్యవస్థలు లేవు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయిలో స్టేట్ మారిటైమ్ బోర్డ్ ఏర్పాటు ప్రతిపాదనల్ని కోస్టల్ సెక్యూరిటీ పోలీసు విభాగం కేంద్రానికి పంపింది. దీనికి ఆమోదం లభించింది.
దీంతో దాదాపు రెండు వేల మందితో కొత్తగా రెండు మెరైన్ బెటాలియన్స్తో పాటు మరో రెండు పోలీసుస్టేషన్ల (పేరుపాలెం, కృష్ణపట్నం) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు నమోదు చేసే కేసుల విచారణకు ప్రస్తుతం కాకినాడలో ఒక కోర్టు మాత్రమే ఉంది. అదనంగా నెల్లూరులో మరొకటి ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.