ఇంతకీ మన పల్లెలెన్ని?
♦ దేశంలో గ్రామాల లెక్కపై గందరగోళం
♦ ఒక్కో సంఖ్య చెబుతున్న ఒక్కో శాఖ
మనదేశంలో మొత్తం గ్రామాలెన్ని..?మనకు చాలాసార్లు ఇలాంటి సందేహం వస్తూంటుంది. దీనికి సమాధానం కోసం ప్రభుత్వ విభాగాలను అడిగితే స్పష్టమైన జవాబు మాత్రం రాదు. ఎందుకంటే దేశంలో ఎన్ని గ్రామాలున్నాయనే దానిపై ప్రభుత్వ శాఖలకే స్పష్టత లేదు. అందువల్లే ఒక శాఖ 6 లక్షల గ్రామాలు ఉన్నాయని చెపితే.. మరో విభాగం 10 లక్షల గ్రామాలు ఉన్నాయని చెపుతుంది. విభాగాలవారీగా గ్రామం అనే పదానికి నిర్వచనాలు భిన్నంగా ఉన్నాయి. దీనికి అనుగుణంగా గ్రామాల సంఖ్య మారిపోతోంది. మొత్తం గ్రామాల సంఖ్య ఎంత అనే దానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పనలో గందరగోళం తలెత్తుతోంది.
ఒక్కో శాఖదీ ఒక్కో లెక్క..
దేశంలో పరిపాలనా సరిహద్దుల గురించిన సమాచారానికి అధీకృత మూలం జనాభాలెక్కలే. 2011 జనాభాలెక్కల ప్రకారం దేశంలో ఉన్న మొత్తం గ్రామాల సంఖ్య 6,49,481. ఇందులో 5,93,615 గ్రామాల్లో ప్రజలు నివసిస్తుండగా.. మరో 50 వేల గ్రామాల్లో జనావాసాలే లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వంద రోజుల పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సేకరించిన గ్రామాలు, కుగ్రామాల సంఖ్య 10 లక్షలకుపైగానే ఉంది. ఇక తాగునీటి, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ అధీనంలో ఉండే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎంఐఎస్) డాటాబేస్‌లో ఈ సంఖ్య 6,08,662గా ఉంది. ఇదే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామీణ)లో గ్రామాల సంఖ్యను 6,05,805గా పేర్కొనడం గమనార్హం.
ఎందుకీ తేడాలు..
వాస్తవంగా చెప్పాలంటే.. ప్రస్తుతం దేశంలో మొత్తం గ్రామాలు ఎన్ననే దానిపై అధీకృత అంచనా లేదు. ప్రణాళికాపరంగా, నిధులు అందజేసే విషయంలో కచ్చితమైన గ్రామాల సంఖ్య తెలుసుకోవడం చాలా కీలకం. ఆర్థిక, పరిపాలనకు సంబంధించి ప్రాథమిక విభాగంగా గ్రామం ఉంటుంది. ప్రభుత్వ రెవెన్యూ విభాగం.. గ్రామాలను నిర్వచించి.. గుర్తిస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కొత్త గ్రామాలను గుర్తిస్తుంది. అయితే ఈ గ్రామాల పేర్లు రెవెన్యూ శాఖ జాబితాలో ఆటోమాటిక్‌గా చేరవు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభాలెక్కల గణన ప్రారంభమైన తర్వాత మాత్రమే అన్ని శాఖల వినియోగానికి అనుగుణంగా రెవెన్యూ గ్రామాన్ని చేర్చుతారు. అందువల్ల ఎప్పటికప్పుడు పెరుగుతున్న గ్రామాలు ఒకే డేటాబేస్‌లో నమోదుకావు.
లెక్కల్లో లేని గ్రామాలూ ఉన్నాయ్..
జనాభాలెక్కల్లో రెవెన్యూ గ్రామాలుగానే కాక.. జనావాసాలు ఉన్న.. జనావాసాలు లేని గ్రామాలుగా విభజిస్తుంది. సెన్సెస్ ప్రకారం సుమారు 50 వేల గ్రామాల్లో జనావాసమే లేదు. అలాగే మారుమూల ప్రాంతాల్లో అటవీ గ్రామాలు–కుగ్రామాలు కూడా ఉంటాయి. రాష్ట్ర అటవీ శాఖ అటవీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం వీటిని గుర్తిస్తుంది. జనాభాలెక్కల పరిధిలోకి రాని ఇలాంటి గ్రామాలను సర్వే చేయని గ్రామాలు అంటారు. ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వ విభాగాలు జనాభా లెక్కల్లోని గ్రామాలను సాధారణంగా పరిగణనలోకి తీసుకోవు. జిల్లా అధికారులు, స్థానిక యంత్రాంగం అందించిన సమాచారాన్నే ఎక్కువగా అనుసరిస్తాయి.
జనావాసమే లేని గ్రామాలు 50,000.
– సాక్షి, తెలంగాణ డెస్క్