నిర్వాసితులందరికీ పునరావాసం
ఆలూరు(గట్టు), న్యూస్‌లైన్: ఆలూరు నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని కలెక్టర్ గిరిజా శంకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్, జేసీ ఎల్. శర్మణ్.. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఆలూరు పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు గ్రామం దగ్గర నిర్మించిన రిజర్వాయర్‌లో ఆలూరు గ్రామం ముంపునకు గురి కానున్నది. ఆలూరు గ్రామస్తులకు బింగిదొడ్డి తండా దగ్గర 139 ఎకరాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ బృందం సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పునరావాస కేంద్రంలో విద్యుత్, తాగు నీటి సౌకర్యం లేదని తెలిపారు. దేవాలయాలు, మసీదు, చర్చి నిర్మాణాలను చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పొలాలకు దారులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక తరలింపునకు పోలీసుల అడ్డంకులున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచినీటి ట్యాంకును మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. పొలాలకు వెళ్లే దారుల గుర్తించాలని సర్వే అధికారులను ఆదేశించారు. ఇసుక తరలింపునకు తహశీల్దార్‌తో అనుమతి పొందవచ్చునని తెలిపారు.
పాఠశాల కోసం విశాలమైన స్థలాన్ని గుర్తించి , నిర్మాణాలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జనవరి 31వ తేదీ తర్వాత రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నీటితో నింపుతామని, గ్రామస్తులు ఆలోపు పునరావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకొవాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆలూరు పునరావాస కేంద్రంలో 1466 ప్లాట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి కుటుంబానికి ఉపాధి ద్వారా 240 రోజుల పని దినాలను కల్పిస్తామని వివరించారు. గట్టు తహశీల్దార్ సైదులు ఎంఈఓ రాంగోపాల్, హౌసింగ్, పీఆర్ ఏఈలు పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్లో ఆర్అండ్ఆర్ సెంటర్
శ్రీరంగాపూర్(పెబ్బేరు): రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఊట నీటితో దెబ్బతింటున్న శ్రీరంగాపూర్ గ్రామంలో ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. జిల్లాలో పునరావాస కేంద్రాలను పరిశీలించేందుకు చేపట్టిన కలెక్టర్ బస్సు యాత్ర మంగళవారం పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్, నాగరాల గ్రామాల్లో కొనసాగింది. శ్రీరంగాపురం వాసులు తమ గ్రామంలోని వీధులను కలెక్టర్‌కు చూపించారు. రంగసముద్రం ఊట నీటితో తమ గ్రామానికి ఎప్పటికైనా ముప్పు తప్పదని, పునరావాసం కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్.. అధికారుల నివేదికల ప్రకారం ఆర్అండ్ఆర్ సెంటర్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీనిచ్చారు. రంగనాయకస్వామి దేవాలయం వద్ద రెస్టారెంట్, షాపింగ్ కాంప్లెక్స్, రంగసముద్రం రిజర్వాయర్‌లో బోటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాటేజీలను నిర్మించి పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామన్నారు, దేవాలయం వద్ద నిర్మించే దుకాణలను ముంపు బాధితులకు లీజుకు ఇస్తామని చెప్పారు. అనంతరం నాగరాల గ్రామంలో నిర్మిస్తున్న మూడు పునారావాస కేంద్రాలను పరిశీలించారు. రంగ సముద్రం రిజర్వాయర్ నిర్మాణం పనులు చివరిదశలో ఉన్నాయని గ్రామస్తులు వెంటనే తమ గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఒకటో కేంద్రంలో మినహా మిగిలిన రెండు కేంద్రాలలో విద్య, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితర సదుపాయాలు కల్పించలేదని గ్రామస్తులు కలెక్టర్‌కు వివరించారు. పూర్తి సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా గ్రామాన్ని ఖాళీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్‌ల ఇంజనీర్ ప్రకాష్, బీమా ఎస్ఈ రమణమూర్తి, ఈఈ ప్రేమ్ కుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ కృపాకర్ రెడ్డి, విద్యుత్ శాఖా ఎస్ఈ సదాశివ రెడ్డి, గృహనిర్మాణ పీడీ రవిందర్ రెడ్డి, ఎస్డీసీ రజియాభేగం, వనపర్తి ఆర్డీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.