పదవి కోసమే పార్టీల మార్పు
నిర్మల్, న్యూస్‌లైన్ : మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి) పదవి కోసమే పార్టీలు మారుతున్నారే గానీ బీఎస్పీపైనో.. దళితులపై ప్రేమతోనే కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అల్లూరి మల్లారెడ్డి విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ ట్యాంకుబండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకే రెడ్డి తన అనుచరులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా బీఎస్పీ తరఫున పోటీ చేయించి ఆ తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ కాంగ్రెస్, టీఆర్ఎస్ టిక్కెట్టు కోసం తిరిగిన విషయం ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలను మోసం చేయడానికే బీఎస్పీలో చేరారని విమర్శించారు.
దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తానని హామీనిచ్చి మాట మార్చిన టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని దళితులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టిన ఏకైక వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. దళితులు వైఎస్సార్సీపీకి మద్దతునివ్వాలని కోరారు. ఆయన హయాంలోనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందంటే అంబేద్కరే కారణమని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంటు, ముస్లింకు నాలుగు శాతం రిజర్వేషన్లు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలెన్నో పేదల కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
వైఎస్సార్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినప్పుడు ఆ భారం మహిళలపై పడకుండా చూశారని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రుల్లో ఎవరు ప్రజోపయోగ పనులు చేపట్టారని ఇటీవల సర్వే చేస్తే 56శాతం మంది తెలంగాణ ప్రజలు వైఎస్సార్ పేరు చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నిగులపు లింగన్న, జుబేర్, అర్షద్, ప్రజ్యోత్ తదితరులు పాల్గొన్నారు.