సీట్ల మోసం కేసులో ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు
వేలూరు: తమిళనాడు వేలూరులోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేసిన అలోక్ చౌహాన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతను తమిళనాడులోని కొట్టాంగలత్తూరు సమీపంలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ బాధిత విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన కాంచీపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు... అతని మోసాల గుట్టును రట్టు చేశారు.
అతని గదిలో జరిపిన సోదాలో రూ. 20 వేల చొప్పున ఆరుగురు విద్యార్థులు పంపిన డీడీలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... అలోక్ సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్ల ఆశ చూపాడు. రూ. 20 వేల చొప్పున డీడీ తనకు పంపిస్తే యూనివర్సిటీల్లో సీటు ఇప్పిస్తానని పేర్కొంటూ పలువురు విద్యార్థులకు ఈ మెయిల్ పంపాడు. ఇది నమ్మి విద్యార్థులు పంపిన డీడీలను తన స్నేహితులకు ఇచ్చి... యూనివర్సిటీలో ఫీజు కింద వాటిని జమ చేయించేవాడు. ఆమేరకు ఆ మొత్తాన్ని నగదు రూపంలో వారి నుంచి తీసుకొనేవాడు. అలా డీడీ పంపిన ఓ విద్యార్థిని వేలూరులోని సంబంధిత యూనివర్సిటీ నిర్వాహకులను ఫోన్లో సంప్రదించింది. అయితే తాము ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించే సీట్లు కేటాయిస్తామని, తాము ఎవ్వరికీ డీడీ ఇవ్వాలని చెప్పలేదని సమాధానమిచ్చారు. దీంతో బాధిత విద్యార్థిని పోలీసులను ఆశ్రయించడంతో అలోక్ మోసాల గుట్టు రట్టయ్యింది. వేలూరులోని ప్రైవేటు ఇంజనీరింగ్ యూనివర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తామంటూ మోసం చేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విద్యార్థులకు సూచించారు.