అచ్చమైన హైదరాబాదీ రుచి
సాక్షి, సిటీప్లస్: హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొస్తుంది.. బిర్యానీ అన గానే ప్యారడైజ్, బావర్చీ అని ఠక్కున మెరుస్తుంది. చాయ్ అనగానే ఆల్ఫా కేఫ్... బ్లూసీ కేఫ్ టేస్ట్ గుర్తొస్తుంది. ఇవన్నీ సరే... పిజ్జా దోశ తిన్నారా ఎప్పుడైనా..? పోనీ... ఈ పిజ్జా దోశ ఎక్కడ దొరుకుతుందో తెలుసా..? దేశీ రుచులే కాదు.. విదేశీ వింత వంటకాలు మన సిటీలో ఎక్కడెక్కడ ఎలాంటి వెరైటీలు దొరుకుతాయో అవగాహన ఉందా..? నోరూరించే ఇలాంటి ప్రశ్నలకు 20 ఏళ్ల సంకీర్త్ టేస్టీ జవాబు కనిపెట్టాడు. ‘జస్ట్ ఫుడ్- హైదరాబాద్’ పేరుతో ఈ-బుక్ లాంచ్ చేసి సిసలైన రుచి ఎక్కడ దొరుకుతుందో చిరునామాలతో సహా పొందుపరిచాడు. పసందైన చైనీ రుచుల్లో దిట్ట అయిన నాన్కింగ్లో మన దేశీ వంటకం అయిన చికెన్ పకోడీ సూపర్బ్‌గా ఉంటుందట. బల్వంత్ పావ్ భాజీలో దొరికే ఛీజ్ పావ్ భాజి టేస్ట్ చేస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఇలా పసందైన మాటలెన్నో.. ఈ బుక్‌లో దొరుకుతాయి.
స్వతహాగా మాంచి భోజన ప్రియుడైన సంకీర్త్.. నగరంలో ఏ ప్లేస్‌లో ఏ వెరైటీ దొరుకుతుందో తెలియక.. నాలుక చంపుకున్న సందర్భాలున్నాయి. ఈ ఇబ్బంది మరొకరికి రావొద్దని ఈ-మెనూకు శ్రీకారం చుట్టాడు. అందుకు రాజధాని నగరంలో వీధి వీధి తిరిగాడు.. పానీపూరి బండి నుంచి తాజ్ కృష్ణ వంటి స్టార్ హోటల్స్ వరకు తిరిగి పూర్తి వివరాలు సేకరించాడు. రాఫెల్స్ మిలీనియమ్ కాలేజ్‌లో మల్టీ మీడియా డిజైనింగ్ కోర్స్ చేస్తున్న సంకీర్త్.., సేకరించిన సమాచారంతో ఈ బుక్ డిజైన్ చేశాడు. ‘గల్లీలో దొరికే లోకల్ టేస్ట్ నుంచి స్టార్ హోటల్స్‌లో దొరికే ఇటాలియన్, ఫ్రెంచ్ డిషెస్ వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. హైదరాబాదీలకే కాదు, హైదరాబాద్ వచ్చే విదేశీ అతిథులకు ‘జస్ట్ ఫుడ్ - హైదరాబాద్’ ఈ బుక్ మంచి గైడ్‌లా ఉపయోగపడుతుందని’ సంకీర్త్ చె బుతున్నాడు.