సామాన్యుడిపైకొరడా
నీటిబిల్లు బకాయిదారులపై ఆర్ఆర్ యాక్ట్
ప్రభుత్వ విభాగాల బకాయిలపై మౌనం
జలమండలి తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు
సాక్షి, సిటీబ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత నీరందిస్తూ ఢిల్లీ జలబోర్డు ఆమ్ ఆద్మీ మనసు దోచుకుంటోంది. ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయని మన జలమండలి.. సామాన్యులపై కొరడా ఝళిపిస్తూ లాభాల బాటలో నడవాలని ప్రయత్నిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆరు నెలలుగా నీటిబిల్లు బకాయిపడిన సామాన్య, మధ్యతరగతి వర్గాలకు.. బ్రిటీషు ప్రభుత్వం 1864లో చేసిన రెవెన్యూ రికవరీ యాక్ట్, సెక్షన్-5 ప్రకారం ఏకంగా 941 రెడ్నోటీసులిచ్చి సంచలనం సృష్టిస్తోంది.
మరోవైపు రూ.850 కోట్లు బకాయిపడిన మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు క్వార్టర్లు, సర్కారు కార్యాలయాల విషయంలో జలమండలి మిన్నకుంటుంది. ఈ విషయంలో హోదా రీత్యా జలమండలికి చైర్మన్గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కూడా ప్రేక్షకపాత్రకే పరిమితమౌతుండటం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.
సామాన్యులపైనే కరకు చట్టం
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న చందంగా మారింది జలమండలి తీరు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.05 లక్షల కుళాయిలున్నాయి. వీటిలో సామాన్య, మధ్యతరగతి, నిరుపేదలకు సంబంధించిన కుళాయిలు సుమారు 4 లక్షల వరకు ఉన్నాయి. వీరిలో నెలవారీగా ఠంచనుగా బిల్లు చెల్లించేవారు 90 శాతం మంది ఉంటారు. మరో పదిశాతం మాత్రం వివిధ వ్యక్తిగత, ఆర్థిక కారణాల రీత్యా ఆర్నెల్లు, ఏడాదికి బిల్లు చెల్లించడం.. బోర్డు ఏర్పడినప్పటి (1989వ సంవత్సరం) నుంచీ ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇటీవల సర్కారు పెద్దలకు దుర్బుద్ధి పుట్టింది. నీటిబిల్లులను పక్కాగా వసూలు చేసి జలమండలిని లాభాల బాట పట్టించేందుకు ఒకవైపు నీటిబిల్లులను ఎడాపెడా పెంచడంతోపాటు, ఆర్నెల్లు బిల్లు బకాయి పడితే చాలు రెవెన్యూ రికవరీ యాక్ట్-1864 లోనిసెక్షన్-5 ప్రకారం కొరడా ఝళిపిస్తోంది.
మహానగరం పరిధిలో గత నెలరోజులుగా 941 రెడ్నోటీసులిచ్చింది. వీటిలో 64 కుళాయి కనెక్షన్లను తొలగించింది. ఇంతటితో ఆగక ఆర్.ఆర్.యాక్ట్ ముసుగుతో బకాయిదారుల ఇళ్లలోని టీవీలు,ఫ్రిజ్లు, కూలర్లు వం టి గృహవినియోగ వస్తువులను బలవంతంగా సీజ్ చేసి సామాన్యులను హతాశులను చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో ఒకవైపు ఉచిత నీరు ఇస్తున్నప్పటికీ ఆ దిశగా నగరంలో చేసిన ప్రయత్నాలు లేకపోగా ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడటం హేయమని స్వచ్ఛం ద సంఘాలు, ప్రజాసంఘాలు, విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రూ.850 కోట్ల సర్కారు బకాయిలపై మౌనం!
మహానగరంలో జలమండలికి మూతపడిన ప్రభుత్వరంగ సంస్థలు, సర్కారు కార్యాలయాలు, వసతి గృహాల నుంచి రావాల్సిన బకాయిలు రూ.850 కోట్ల వరకు ఉన్నాయి. వీటి వసూలుకు జలమండలి ఆపసోపాలు పడుతోంది. ఆయా విభాగాలకు మొక్కుబడిగా లేఖలు రాసి చేతులు దులుపుకొంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి హోదా రీత్యా చైర్మన్గా ఉన్నప్పటికీ బకాయిల వసూలుకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో జలమండలి రోజురోజుకూ రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. యుద్ధప్రాతిపదికన బకాయిల వసూలు చేయడమో లేదా ప్రభుత్వం ఆ మొత్తాన్ని గ్రాంటుగా మంజూరు చేయడమో చేస్తేనే బోర్డు ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గడమే కాదు.. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు చెందిన 4 లక్షల కుళాయిలకు ఉచిత నీరు సరఫరా చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా కరకు చట్టాల అమలుపై జలమండలికి కనువిప్పు కలుగుతుందా?