amarmath
-
చేతగాని సీఎం ఏపీకి శాపం
♦ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపాటు ♦ సీఎం పీఠాన్ని కదిలించేలా రైల్వే జోన్ కోసం ఉద్యమించాలని పిలుపు సాక్షి, విశాఖపట్నం: చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి శాపమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ముఖ్యమంత్రి, టీ డీపీకి చెందిన కేంద్ర మంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ను తీసుకురాలేని దద్దమ్మలని ఘాటుగా విమర్శించారు. రైల్వే జోన్ సాధన కోసం విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం రోజా, తిరుపతి ఎంపీ వరప్రసాద్ సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పరిస్థితి కేంద్రం వద్ద తేలు కుట్టిన దొంగలా తయారైందన్నారు. టీడీపీలో మగాళ్లు లేరని తెలిసే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాయలసీమ గడ్డపై పుట్టి ఉంటే, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నిక లు పెడితే మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలతో చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయేలా ఫలితాలొస్తాయన్నారు. అమర్నాథ్ దీక్షకు తమ అధినేత జగన్‌తో పాటు పార్టీ అంతా అండగా ఉంటుందన్నారు. సీఎం పీఠాన్ని, ఢిల్లీలో నేతలను కదిలించేలా రైల్వే జోన్ కోసం ఉద్యమించాలని రోజా కోరారు. ముఖ్యమంత్రి, కేంద్రంలో ఏపీ మంత్రుల చేతగానితనం వల్ల విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేరడం లేదని ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. సత్తాలేకే ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. -
'టీడీపీలో మగాళ్లు లేరు కాబట్టే..'
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరు కాబట్టే.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకెళ్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా ఇరుక్కున్నాడు కాబట్టే.. ఆంధ్రప్రదేశ్‌ను ఆయన కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు రూ. 10 వేల కోట్లు ఇవ్వమని కోరితే.. కేంద్రం రూ.700 కోట్లు ఇచ్చిందని రోజా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ కోసం నాలుగురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గుడివాడ అమర్నాథ్కు ఆదివారం సంఘీభావం తెలిపిన రోజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు చేతగాని దద్దమ్మలు కావడం వల్లే రాష్ట్రానికి రైల్వే జోన్‌ను తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. వారు దద్దమ్మలు కావడం వల్లే తాము పోరాడాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు సీఎం కావడం ఏపీకి శాపం అని రోజా విమర్మించారు. మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు పోటీపడి దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఉత్తరాంధ్ర మంత్రులకు రైల్వేజోన్ వ్యవహారం పట్టదా అని ఆమె నిలదీశారు. అడ్డదిడ్డంగా మాట్లాడే అచ్చెన్నాయుడు ఏనాడైనా రైల్వే జోన్ కోసం పోరాడారా అని రోజా ఈ సందర్భంగా ప్రశ్నించారు. రైల్వే జోన్ వస్తే ఉద్యోగవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయన్న ఆమె.. రైల్వే జోన్ సాధించే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని, దీనికి అందరూ కలిసిరావాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం విభజన హామీలను రాష్ట్రానికి తీసుకురాలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. కేంద్ర పథకాల నిధులను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని, ప్రజలు దీనిని గమనించాలని ఆయన కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటివరకూ ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం శోచనీయం అని వరప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఉంటే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.