
చేతగాని సీఎం ఏపీకి శాపం
♦ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా మండిపాటు
♦ సీఎం పీఠాన్ని కదిలించేలా రైల్వే జోన్ కోసం ఉద్యమించాలని పిలుపు
సాక్షి, విశాఖపట్నం: చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి శాపమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మండిపడ్డారు. ముఖ్యమంత్రి, టీ డీపీకి చెందిన కేంద్ర మంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ను తీసుకురాలేని దద్దమ్మలని ఘాటుగా విమర్శించారు. రైల్వే జోన్ సాధన కోసం విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం రోజా, తిరుపతి ఎంపీ వరప్రసాద్ సందర్శించి, సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పరిస్థితి కేంద్రం వద్ద తేలు కుట్టిన దొంగలా తయారైందన్నారు. టీడీపీలో మగాళ్లు లేరని తెలిసే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాయలసీమ గడ్డపై పుట్టి ఉంటే, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నిక లు పెడితే మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలతో చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయేలా ఫలితాలొస్తాయన్నారు. అమర్‌నాథ్ దీక్షకు తమ అధినేత జగన్‌తో పాటు పార్టీ అంతా అండగా ఉంటుందన్నారు. సీఎం పీఠాన్ని, ఢిల్లీలో నేతలను కదిలించేలా రైల్వే జోన్ కోసం ఉద్యమించాలని రోజా కోరారు.
ముఖ్యమంత్రి, కేంద్రంలో ఏపీ మంత్రుల చేతగానితనం వల్ల విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేరడం లేదని ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. సత్తాలేకే ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.