హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ : నగరంలోని అంబర్‌పేట-గోల్నాక ప్రధాన రహదారిలో శనివారం వాహనదారులు నరకయాతన పడ్డారు. మెట్రో రైలు పనుల కారణంగా మలక్‌పేట వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వాహనాలను... అదే విధంగా విజయవాడ నుంచి దిల్సుఖ్నగర్ మీదుగా అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ల వైపు వచ్చే వాటిని అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా నుంచి గోల్నాక మీదుగా అప్జల్‌గంజ్ వైపు మళ్లిస్తున్నారు.
వాహనాల రద్దీని తక్కువగా అంచనా వేయటంతో అంబర్‌పేట రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వారం క్రితం ట్రయల్ వేసిన ట్రాఫిక్ అధికారులు సమస్య తీవ్రతను అంచనా వేయకుండానే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడ్డారు. దీంతో రోడ్లన్నీ పెద్ద సంఖ్యలో వాహనాలతో నిండిపోయాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ అధికారులు నానా హైరానా పడ్డారు.
ఖైరతాబాద్ లో దారి మళ్లింపు..
ఖైరతాబాద్ జంక్షన్లో జరుగుతున్న మెట్రో పనుల నేపథ్యంలో పలు దారులను అధికారులు ఈ రోజు మూసివేశారు. నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడే కేసీపీ గెస్ట్‌హౌజ్ చౌరస్తా నుంచి ఖైరతాబాద్ వెళ్లే వాహనదారులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, ఆనంద్ నగర్ కాలనీ శ్రీధర్ ఫంక్షన్ హాల్ నుంచి ఖైరతాబాద్ చౌరస్తాకు వెళ్లే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ తీసుకొని కేసీపీ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకొని ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రహదారులకు వెళ్లాల్సి ఉంటుంది.