కొడుకు ఉద్యోగం కోసం తండ్రి ఆత్మహత్యాయత్నం
డబ్బు తీసుకొని మొండి చేయిచూపిన టీడీపీ నేత
యర్రగొండపాలెం: తన కుమారుడి ఉద్యోగం కోసం టీడీపీ నేతకు లంచమిచ్చి మోసపోయిన ఓ తండ్రి ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన బుధవారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది. పెద్దదోర్నాల మండలం రామచంద్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నేత మాలపాటి సుబ్బయ్య ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో రాసుకున్న సూసైట్ నోట్ ప్రకారం.. రామచంద్రకోటలో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లో తన కుమారుడు వెంకటరెడ్డికి వాచ్మన్ ఉద్యోగం ఇప్పిస్తానని టీడీపీ నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యుడు అంబటి వీరారెడ్డి రూ. 1 లక్ష తీసుకున్నాడు. వెంకటరెడ్డితో పాటు మరో ముగ్గురిని ఉద్యోగంలో చేర్పించారు.
రెండు నెలల తరువాత కూడా వెంకటరెడ్డికి జీతం ఇవ్వలేదు. దీనిపై వీరారెడ్డిని ప్రశ్నించగా.. ఇంకా కొంత డబ్బు ఇవ్వాలని ఆ టీడీపీ నేత కోరాడు. వెంటనే రూ.10 వేలు ఇచ్చాడు. ఆ తరువాత ఆ ఉద్యోగం మరొకరికి ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం గురించి మరో త్రిసభ్య కమిటీ సభ్యుడు డాక్టర్ మన్నె రవీంద్ర దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ విషయం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు దృష్టికి తీసుకొనివెళ్తే తననే కోపగించుకున్నారని ఆ సూసైడ్ నోట్లో సుబ్బయ్య పేర్కొన్నాడు. దీనిపై జరిగిన చర్చల్లో కూడా సరైన సమాధానం రాకపోవడంతో సుబ్బయ్య తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగిఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనకు చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది.