నేటి నుంచి జిల్లాలో షీ టీమ్స్ సేవలు
ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా
వరంగల్ క్రైం: మహిళలను వేధించే పోకిరీలకు చెక్ పెట్టేందుకు వరంగల్ రూరల్, అర్బన్ పరిధిలో షీ టీమ్స్ గురువారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో షీ టీమ్‌లు విజయవంతమైన నేపథ్యంలో డీజీపీ అనురాగ్ శర్మ ఈ కార్యక్రమాన్ని అన్నిజిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం నుంచి షీ టీంలు చురుగ్గా పనిచేస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి షీ టీమ్స్‌ను మోహరిస్తామని వివరించారు. వేధింపులకు గురయ్యే మహిళలు, విద్యార్థినులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు. వరంగల్ రూరల్, అర్బన్ పరిధిలో చురుకైన అధికారులు, సిబ్బందితో ఒక ఎస్ఐ సారధ్యంలో నాలుగు షీ టీమ్స్ బృందాలు పనిచేస్తాయని వెల్లడించారు. జిల్లా పరిధిలోని మహిళలు, విద్యార్థినుల సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.