‘రంగస్థలం’ కోసం కష్టపడుతున్న రామ్చరణ్
మెగా హీరో రామ్ చరణ్ తాజా చిత్రం ‘రంగస్థలం’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ రొమాంటిక్-డ్రామా కోసం ఈ యంగ్ హీరో చాలా కష్టపడుతున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాడని చిత్ర యూనిట్ వర్గాల కథనం.
చాలా కష్టతరమైన షెడ్యూల్ కోసం రోజంతా పనిచేస్తున్నాడని చెబుతున్నారు. సూర్యోదయానికి ముందు షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెడితే సూర్యాస్తమయం తరువాత మాత్రమే ఇవి ముగిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో షూటింగ్ కారణంగా చరణ్ గాయపడుతున్నప్పటికీ, అలాంటివేమీ లెక్కచేయకుండా రామ్ చరణ షూటింగ్ కార్య క్రమాలను కొనసాగిస్తున్నారంటూ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. గోదావరి జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ చాలా సంతృప్తికరంగా జరుగుతోందని యూనిట్ ప్రకటించింది. ఈ నెలాఖరువరకు ఈ షూటింగ్ కొనసాగుతుందనీ, అనంతరం హైదరాబాద్లో నిర్మించిన గ్రాండ్ సెట్లో ఉంటుందని తెలిపింది. ఈ సెట్నిర్వహణ బాధ్యతలను ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ చూస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం వానలు జోరుగా కురుస్తుండడంతో వాటిని కూడా ఉపయోగించుకుంటున్నారట డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాలో వర్షం సీన్లు చాలా కీలకం కావడంతో వానల్లో కూడా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మరోవైపు లుంగీ కట్టుకొని న్యూలుక్లో చెర్రీని చూసి అక్కడి అభిమానులు మురిసిపోతున్నారట. సమంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారని భావిస్తున్నారు.
కాగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి , జగపతి బాబు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.