పునర్జన్మలను సరికొత్తగా డీల్ చేశాం : కె.వి.ఆనంద్
‘‘పునర్జన్మలకు సంబంధించి చాలా వార్తలు చూసే ఉంటాం. ఈ కాన్సెప్ట్ మీద చాలా చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నంగా శాస్త్రీయంగా డీల్ చేస్తూ, నాలుగు తరాలను బేస్ చేసుకుని రాసుకున్న కథ ఇది. తెలుగులో కూడా పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు కేవీ ఆనంద్ అన్నారు. ఆయన దర్శకత్వంలో ధనుష్, అమైరా దస్తూర్ జంటగా కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత్తి ఎస్. సురేశ్ నిర్మించిన ‘అనేకుడు’ చిత్రం ఇటీవలే విడుదలైంది.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ మాట్లాడుతూ-‘‘నాలుగు ప్రేమ కథలను కేవీ ఆనంద్ బాగా తెరకెక్కించారు. పాటలకు, సినిమాకు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. పాటల రచయిత సాహితి మాట్లాడుతూ -‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో మాస్ సాంగ్ రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.