సొంత ఆరోగ్య బీమా పాలసీ అవసరం
‘ఆరోగ్య బీమా పాలసీని మనకు అవసరం పడకముందే తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా అవసరమైనప్పుడు మనం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు’ అనేది ఒక నానుడి. నిజంగానే తీవ్ర అనారోగ్య సమస్యలు ఒకోసారి చెప్పా పెట్టకుండా మూకుమ్మడిగా దాడి చేస్తుంటాయి. అలాంటప్పుడు కొండలా పెరిగిపోయే వైద్యం ఖర్చులు చూస్తుంటే మానసికంగా కూడా ఆవేదన తప్పదు. అదే ఆరోగ్య బీమా పాలసీ ఉందంటే..ఇటు ఆర్థికంగాను, అటు మానసికంగానూ భరోసాగా నిలుస్తుంది. తగినంత కవరేజీ ఉంటే వైద్య ఖర్చులు ఎంతైనా సరే ఆర్థికంగా ఆందోళన చెందనక్కర్లేదు.
కాబట్టే ఈ విషయంలో కాస్త వివేకంతో వ్యవహరించకపోతే కూడబెట్టినదంతా వైద్యానికే హరించుకుపోయే ప్రమాదముంది అంటున్నారు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌కి చెందిన అమిత్ భండారీ. ఇలాంటప్పుడు కంపెనీలిచ్చేవే కాకుండా సొంత ఆరోగ్య బీమా పాలసీ ఆవశ్యకతను తెలియజేస్తున్నారాయన.
గ్రూప్ హెల్త్ కవరేజీతో పోలిస్తే మన అవసరాలకు తగినట్లుగా ఎంచుకోగలిగే వ్యక్తిగత, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో మరింత మెరుగైన కవరేజీ లభిస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. కంపెనీ ఇచ్చే గ్రూప్ పాలసీ ఉంది కదా.. మరొకటి తీసుకోవడం దండగ అనే భావన కూడా చాలా మందికి ఉంటుంది. కానీ ఈ ధోరణి సరికాదు. ఎందుకంటే..
ఒక్క కవరేజీ సరిపోదు
వైద్య అవసరాలకు కంపెనీ అందించే బీమా పాలసీ సరిపోతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే, ఈ పాలసీలకు కొన్ని పరిమితులు, షరతులు, నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు చాలా మటుకు గ్రూప్ పాలసీల్లో రూ. 2-4 లక్షల కవరేజీ పరిమితి ఉంటుంది. ఏదైనా కీలకమైన సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఇది ఒకోసారి సరిపోకపోవచ్చు. కొన్ని కంపెనీలు సబ్-లిమిట్స్ లేదా కో-పే వంటి నిబంధనలతో కూడా పాలసీలు తీసుకుని ఉండొచ్చు. ఇలాంటి వాటి వల్ల ఎంతో కొంత మీ జేబు నుంచి కూడా కట్టాల్సి రావొచ్చు.
ఇక, రిటైర్మెంట్ తర్వాత కంపెనీ అందించే హెల్త్ కవరేజీ ప్రయోజనాలు ఉండవు. ఆ వయస్సులో మధుమేహం, హైబీపీ వంటి వాటితో సతమతమవుతూ ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుందామంటే అంత సులువుగా కుదరకపోవచ్చు. అదే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే జీవితకాలం రెన్యువల్ చేసుకునే వీలుంటుంది.
స్వల్పకాలికంగానే వర్తింపు
కంపెనీలు ఇచ్చే ఆరోగ్య బీమా పాలసీల కవరేజీ ..ఆయా సంస్థల్లో పనిచేసినంత కాలం మాత్రమే మనకు వర్తిస్తుంది. ఆ సంస్థలో మానేసినా లేదా రిటైరైనా కవరేజీ పోతుంది. సరైన వ్యక్తిగత ఆరోగ్య బీమా దన్ను లేకపోతే వైద్య ఖర్చులు పెరిగిపోయి.. కుటుంబ బడ్జెట్ తల్లకిందులు కావొచ్చు.
కొంగొత్త ఆరోగ్య సమస్యలు
జీవన విధానాలు, పర్యావరణంలో మార్పులు తదితర అంశాల కారణంగా స్వైన్ ఫ్లూ, చికున్ గున్యా, సార్స్ లాంటి కొంగొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. హృద్రోగాలు, క్యాన్సర్ మొదలైన సమస్యలు వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయి. ప్రస్తుతం హాస్పిటలైజేషన్‌తో పాటు అవుట్ పేషంట్ చికిత్స వ్యయాలు, రొటీన్ వైద్య పరీక్షలు మొదలైన వాటన్నింటికి కూడా కవరేజీనిచ్చేలా సమగ్రమైన పాలసీలు లభిస్తున్నాయి. ఒకవేళ ఏ ఏడాదిలోనైనా మీరు క్లెయిమ్ దాఖలు చేయనిపక్షంలో కవరేజీపరంగా మరికాస్త బోనస్ లభిస్తుంది.
చూశారు కదా.. సొంతానికి తీసుకునే ఆరోగ్య బీమా పాలసీ వల్ల ఒనగూరే ప్రయోజనాలు. చివరిగా ఒక మాట హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందుగా తగినంత అధ్యయనం చేయాలి. వివిధ బీమా సంస్థల నుంచి కొటేషన్లు తెప్పించుకుని పరిశీలించాలి. అయితే ప్రీమియం ఒక్కటే ప్రాతిపదిక కాదు.. సదరు సంస్థ అందించే సర్వీసుల నాణ్యత కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. డాక్యుమెంటును క్షుణ్నంగా చదువుకుని, అర్థం చేసుకున్న తర్వాతే పాలసీని తీసుకోవాలి.
ఆర్థిక ప్రయోజనాలు...
హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల ఒనగూరే ఆర్థిక ప్రయోజనాల్లో పన్నులపరమైనవి కూడా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 60 ఏళ్ల వయస్సు దాకా సొంతానికి గానీ, జీవిత భాగస్వామి, పిల్లల కోసం గానీ తీసుకునే పాలసీలకు సంబంధించి కట్టే రూ. 25,000 దాకా ప్రీమియంకు డిడక్షన్ లభిస్తుంది. ఒకవేళ 60 ఏళ్లు పైబడిన మీ తల్లిదండ్రులకు కూడా పాలసీ తీసుకున్న పక్షంలో మరో రూ. 30,000 దాకా డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
- అమిత్ భండారీ
హెడ్ (హెల్త్ ఇన్సూరెన్స్) ఐసీఐసీఐ లాంబార్డ్