Amma cement
-
అమ్మ సిమెంట్ బస్తా రూ.190 మాత్రమే!
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేరుతో తమిళనాడులో పరిచయమైన పథకాల జాబితాలో కొత్తగా అమ్మ సిమెంట్ చేరింది. 50 కిలోల సిమెంట్ బస్తా కేవలం 190 రూపాయలకే అందేలా పథకాన్ని రూపొందించారు. తిరుచిరాపల్లిలో సోమవారం ఐదు చోట్ల సిమెంటు బస్తాల విక్రయాన్ని ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా 470 కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నవారికి మాత్రమే అమ్మ సిమెంట్ విక్రయించేలా నిబంధన విధించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గత సెప్టెంబరు 26న ఈ పథకాన్ని ప్రకటించారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పేద, మధ్య తరగతి వర్గాల్ని ఆకర్షించే విధంగా పథకాల్ని ప్రవేశపెడుతూ వస్తోంది. పేదలకు ఉచిత బియ్యం, విద్యార్థులకు ల్యాప్టాప్లు, సైకిళ్లు, ఉచిత పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూ, పాదరక్షల్ని అందిస్తున్నారు. పేద యువతుల వివాహానికి బంగారు తాళి పథకం, కుటుంబ కార్డుదారులకు మిక్సీ, గ్రైండర్లు, ఫ్యాన్ల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉచిత పథకాలు ఓ వైపు ఉంటే, మరో వైపు అమ్మ పేరిట క్యాంటీన్లు, వాటర్ బాటిళ్లు, అమ్మ సంత, కూరగాయల దుకాణాలు, ఉప్పు విక్రయాలు, మెడికల్ షాపులు ప్రజల ముంగిటకు చేరాయి. ఇప్పుడు అమ్మ పేరిట సిమెంట్ విక్రయాలకు కూడా శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని అనేక నగరాల్లో భవన నిర్మాణలు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో సిమెంట్ వినియోగం పెరగడంతో ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధరలు పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా మారాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో సిమెంట్ విక్రయాలను మొదలుపెట్టింది. -
ఎన్ని పథకాలు పెట్టినా.. 'అమ్మ' ఇంటికే!
అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, తాజాగా అమ్మ సిమెంటు... ఇలా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కూడా 'అమ్మ' చివరకు ఇంటిదారి పట్టక తప్పట్లేదు. ఎప్పుడో 17 ఏళ్ల క్రితమే 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారంటూ నాటి జనతాపార్టీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కేసు పెట్టడం.. దాని విచారణ ఇన్నేళ్ల పాటు సాగడం, చివరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికూన్ ఆమెను దోషిగా నిర్ధారించడంతో ఇక ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాకర్షక పథకాలను ప్రకటించడం ద్వారానే జయలలిత ఎక్కువ ఆదరణ పొంది.. ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, బాలింతలకు ఉయ్యాలలు.. ఇలా అనేక వరాలు కురిపించారు. అయినా కూడా ఇప్పుడు అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో పదవి కోల్పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
'రూ. 190 లకే సిమెంట్ బస్తా'
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమ్మ సిమెంట్ పథకాన్ని శుక్రవారం చెన్నైలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బస్తా సిమెంట్ రూ. 190లకే అందించనున్నట్లు తెలిపారు. సిమెంట్ బస్తా ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో పేద మధ్య తరగతి వర్గాలు ఇల్లు కట్టుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయా వర్గాల వారికి తక్కవ ధరకే సిమెంట్ బస్తా అందించాలని ఉద్దేశ్యంతో జయలలిత అమ్మ సిమెంట్ పథకాన్ని ప్రకటించారు. త్వరలో అమ్మ సిమెంట్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. జయలలిత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదలు, మధ్య తరగతి ప్రజల కోసం అమ్మ పేరిట పలు పథకాలను ప్రారంభించారు. అమ్మ క్యాంటిన్లు, అమ్మ మెడికల్స్, అమ్మ వాటర్, అమ్మ కూరగాయలతోపాటు పలు పథకాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాలు తమిళ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.