అమ్మ కల్యాణ మండపం
‘అమ్మ’ పేరిట మరో పథకం అమల్లోకి రానున్నది. రాష్ట్రంలో అమ్మ కల్యాణ మండపం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తొలి విడతగా రూ. 83 కోట్లతో 11 చోట్ల ఈ కల్యాణ మండపాలు నిర్మించేందుకు నిర్ణయించారు. అలాగే, రాష్ట్ర గుడిసెల నిర్మూలన విభాగం నేతృత్వంలో ఈ ఏడాది రూ.18 వేల కోట్లతో 50 వేల గృహాల నిర్మాణానికి సీఎం జయలలిత ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి, చెన్నై: 2011లో అధికార పగ్గాలు చేపట్టగానే, అమ్మ క్యాంటిన్, వాటర్, ఉప్పు, సిమెంట్, తోట, పచ్చదనం దుకాణాలు, మెడికల్ షాపులు...ఇలా అమ్మ పేరుతో పథకాలు హోరెత్తాయి. అలాగే, అమ్మ థియేటర్, అమ్మ సంత పథకాలు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అమ్మ పథకాల జాబితాలో మరొకటి చేరింది. అదే, అమ్మ కల్యాణ మండపం. రాష్ర్ట వ్యాప్తంగా ఈ నిర్మాణాలకు నిర్ణయించినా, తొలి విడతగా 11 చోట్ల అమ్మ కల్యాణ మండపాలు అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకోనున్నాయి. రాష్ట్రంలో కల్యాణ మండపాల అద్దెల మోత మోగుతున్న సమయంలో అమ్మ జయలలిత తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా ఆహ్వానించే పనిలో పడ్డారు.
అమ్మ కల్యాణ మండపం:
అమ్మ కల్యాణ మండపాల నిర్మాణం కోసం రూ.83 కోట్లను కేటాయిస్తూ, సీఎం జయలలిత శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు చెన్నైలో తండయార్ పేట, వేళచ్చేరి, అయపాక్కం, పరుత్తి పట్టు, పెరియార్ నగర్, కోరట్టూరులలో ఈ కల్యాణ మండపాలను నిర్మించనున్నారు. అలాగే, మదురై అన్నానగర్, తిరునల్వేలి అంబా సముద్రం, సేలం నగరం, తిరువళ్లూరు జిల్లా కొడుంగయూర్, తిరుప్పూరు జిల్లా ఉడుమలై పేటలలో ఈ నిర్మాణాలు జరగనున్నాయి.
18 వేలతో 50 వేల గృహాలు:
రాష్ర్ట గుడిసెల నిర్మూలన విభాగం నేతృత్వంలో ఈ ఏడాది రూ.18 వేల కోట్లతో 50 వేల గృహాల్ని నిర్మించేం దుకు నిర్ణయించారు. ఇందుకు తగ్గ ఆదేశాలను సీఎం జయలలిత జారీ చేశారు. సొంత స్థలాన్ని కల్గి, ఇళ్లను నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న పేద వర్గాల కోసం 45 వేల గృహాల్ని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు ఒక్కోగృహానికి రూ. 2.1లక్షలు అందించనున్నారు. అలాగే, ఐదు వేల బహుళ అంతస్తుల తరహా గృహాల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో రెండు వేల గృహాలను షోళింగనల్లూరులో నిర్మించనున్నారు.
ఇక, స్థల విక్రయ పన్ను భారం నుంచి లబ్ధిదారులకు ఊరట కల్గించే విధంగా వడ్డీలో రాయితీ కల్పించనున్నారు. మధ్య తరగతి, ఉద్యోగుల్ని దృష్టిలో ఉంచుకుని విక్రయం నిమిత్తం 645 చ.అడుగులు, 807 చ.అడుగులతో బహుళ అంతస్తుల తరహాలో గృహాల్ని నిర్మించనున్నారు. ఇందులో హాల్, వంట గది, రెండు బెడ్రూమ్లు ఉంటాయి. 645 చ.అ గృహాలు రూ. 20 లక్షలలోపు, 807 చ.అడుగుల గృహాలు రూ. 30 లక్షలలోపు విక్రయించడం జరుగుతుందన్నారు. ఇక,ఉద్యోగులు అద్దెకు ఉన్న గృహాలు అనేకం శిథిలావస్థల్లో ఉన్న దృష్ట్యా, వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు.