అమ్మఒడితో భరోసా
జననేత తొలి సంతకం
అందరికీ విద్య
జిల్లాలో 8 లక్షలమంది విద్యార్థులకు వరం
సాక్షి, విజయవాడ : పేదరికం చదువుకి శాపం కాకూడదు. ప్రతి పేదవిద్యార్థి చదువుకోవాలి. చదువుతోనే కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ప్రగాఢంగా విశ్వసించారు పెద్దాయన. అందుకే ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టగానే విద్యార్థుల భవిత కోసం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని రూపొందించి ప్రాణం పోశారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీర్లుగా, డాక్టర్లుగా దేశవిదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు ఆలంబనగా నిలిచారు...నిలుస్తున్నారు. కానీ ఆయన మరణానంతరం రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి పాలనలో పథకానికి తూట్లు పోడిచి పూర్తి నిర్వీర్యం చేశారు.
మళ్లీ ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే తొలి సంకతకం అమ్మ ఒడి పథకంపైనే అని ప్రకటించారు. తద్వారా ఒకటో తరగతి మొదలుకుని పిజీ వరకు చదువుకునే విద్యార్థుల పాలిట ఈ పథకం వరంలా మారనుంది. ఎన్నికలు ముగిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలో 8లక్షల మంది విద్యార్థులకు పూర్తిగా మేలు జరుగుతుంది.
జిల్లాలో 1 నుంచి 10 వతరగతి వరకు 5.89 లక్షల మంది, ఇంటర్ 90వేల మంది ,డిగ్రీ, పీజీ ఇతర కోర్సులు చదివే విద్యార్థులు 1.50 లక్షలు మంది ఉన్నారు. వీరిలో 80శాతం మంది భారీ ఫీజులు చెల్లించే ఆర్థిక స్తోమత లేని వారే. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు దివంగత వైఎస్ రాజశఖరరెడ్డి 2008లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబిఎ, ఎంసీఏ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని దీనిని రూపొందించి అమలు చేశారు.
కానీ గత కిరణ్ సర్కారు మాత్రం దీనిని 70 శాతం మేరకు కుదించి అరకొరగా కొద్ది మందికే దీనిని అమలు చేయడంతో ఫీజులు చెల్లించే స్థోమత లేని అనేక మంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువును ఆపివేసిన సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అవసరాల కోసం రూ. 6 వేలకోట్లు ఖర్చు పెడతామని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు.
అమ్మ ఒడితో 8లక్షల మందికి మేలు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మేధోమదనం చేసి అచరణకు సాధ్యంగా ఉండేలా అమ్మఒడి అనే బృహత్తర పథకానికి రూపకల్పన చేసింది. పథకం ద్వారా విద్యార్థులను చదివించే బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది. అంతే కాకుండా పిల్లల్ని చదివించినందుకు గానూ తల్లిదండ్రుల్ని ప్రొత్సహించడానికి నెలనెల వారి బ్యాంకు ఖాతాలో నేరుగా కొంత నగదు జమ చేసేలా పథకాన్ని రూపొందించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం అమ్మఒడి పథకంపైనే చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. 1నుంచి 10 వతరగతికి ప్రతి నెలా రూ.500 ఇంటర్ రూ.700 డిగ్రీ రూ.1000 చొప్పున విద్యార్థుల తల్లి అకౌంట్లో నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం 8లక్షల మంది విద్యార్థులకు తక్షణమే మేలు జరగనుంది. దీంతో పాటు జిల్లాలో చదవుకునే విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుంది.