Ammangi Venugopal
-
కాళోజీ జీవితంలోని రెండు ఉదంతాలు
సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి కాళోజీ రెండోసారి (1942) జైల్లో వున్నప్పుడు టి.బి. మూలంగా తీవ్రంగా సుస్తీ చేసింది. అప్పటికే ఒక ఊపిరితిత్తిని కోల్పోయిన ఒంటూపిరి మనిషి జైల్లోవుంటే దుర్గతి తప్పదని అన్న రామేశ్వరరావు భయపడ్డాడు. ఎట్లాగైనా విడిపించి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. జైలు అధికారి క్రూరుడు. శిక్ష రెండున్నరేండ్లు. అప్పటికి గడిచింది ఆరునెలల కాలమే! జీవితాంతం సర్కారును విమర్శించబోనని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే విడుదల చేస్తామన్నారు. అన్నగారి సమక్షంలో జైలు అధికారి ఆ కాగితం కాళోజీకి ఇచ్చాడు. సంతకం చేయమని ఆదేశించాడు. ‘‘ఈ రొండేండ్లు నా చేతి కింద నలిగి నిలబడలేవు. ఉన్నా చచ్చిపోతావ్’’ అని హుంకరించాడు అధికారి. తాను ఆ షరతులకు లొంగేది లేదని కాళోజీ తిరుగులేని మాటల్లో చెప్పేశాడు: ‘‘రొండేండ్లు ముందుగా సర్కారు విడిచిపెడుతనంటున్నది. నేను ఆ రొండేండ్లు మాత్రమే సర్కారును విమర్శించను. అంతేతప్ప ఆజన్మాంతం సర్కారుకు విరుద్ధంగా ప్రవర్తించనని మాత్రం చస్తే రాసివ్వ’’.కాళోజీ షరతులకు సర్కారు అంగీకరించింది! దీంతో కాళోజీ విడుదలై ఇల్లు చేరాడు. వద్దిరాజు రాజేశ్వరరావు అనే పెద్ద వకీలు దగ్గర కాళోజీ జూనియర్‌గా పని చేసేవాడు. రాజేశ్వరరావు పెద్ద జమీందారు. 49 మంది వున్న సమష్టి కుటుంబానికి యజమాని. ఆ భార్యాభర్తలకు దోమలు కరుస్తుండటం వల్ల ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఇది గమనించి కాళోజీ- ‘‘భాయీసాబ్, రొండు దోమ తెరలు కొనుక్కోవద్దా మీరు?’’ అని అడిగాడు. అందుకు రాజేశ్వరరావు -‘‘మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ గద, అందరికి బాధ్యత వహించవలసిన వాణ్ణి నేను. మాకు ఆమ్దని వున్నది. ఖర్చున్నది. 49 దోమతెరలు కొనేటి అవకాశం వున్నప్పుడు మాక్కూడ రొండు దోమతెరలు వస్తయి’’ అన్నాడు. జమీందారుకు 49 మంది విషయంలోనైనా సమదష్టి వున్నందుకు కాళోజీ ఆలోచనలో పడ్డాడు. ‘మరి ఈ కాళోజీ విశ్వమంత ఒకటే కుటుంబమనుకున్నడు. అందరు సుఖపడాలే అనుకున్నడు. తన దోమతెర గురించి పట్టించుకున్నడు. తన భార్యకు దోమతెర వున్నదో లేదో అని ఎన్నడు ఆలోచించలే’ అనుకుంటూ తన ఆలోచనకూ ఆచరణకూ మధ్యవున్న తేడాను గుర్తించటమే కాదు, ఈ ఉదంతాన్ని కాళోజీ గర్వభంగంగా భావించాడు. జీవితంలోఒక పాఠం నేర్చుకున్నాడు. రచయిత: అమ్మంగి వేణుగోపాల్ 9441054637 -
అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం
హైదరాబాద్ : కాళోజీ స్మారక పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రముఖ రచయిత, సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్...ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. తెలంగాణలో భాష, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి తొలిసారిగా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సర్కార్ ...కాళోజీ పేరుతో ఈ స్మారక పురస్కారాన్ని అందిజేస్తోంది. అలాగే కాళోజీ జయంతిని పురస్కరించుకొని బుధవారం తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో, హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ భాషా చైతన్య కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, కవితల పోటీలు నిర్వహిస్తారు.