‘హింస భరించలేను.. నా భర్తకు విడాకులిస్తా’
మీరట్: దేశ వ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ అంశంపై చర్చ జరుగుతుండగా.. తన భర్తకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి అతడు పెట్టే హింస నుంచి బయటపడతానంటూ ఓ ముస్లిం మహిళ బయటకొచ్చింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆమె పెళ్లయినప్పటి నుంచి తన భర్త, అతడి సోదరుడు, కుటుంబ సభ్యుల నుంచి పడుతున్న హింస అంతాఇంతా కాదంటూ వాపోయింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన అమ్రీన్ బానో అనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడి సోదరుడు షకీర్‌ను ఆమె సోదరి ఫర్హీన్ వివాహం చేసుకుంది. అయితే, వీరిద్దరి ప్రతి రోజు ఆ సోదరుల నుంచి టార్చర్ మొదలైంది.
ఫర్హీన్ భర్తను ఒకసారి అమ్రీన్ కుమారుడు కేవలం ఒక ఐదు రూపాయలు అడిగినందుకు ఆ బాలుడిపై చేయిచేసుకోవడమే కాకుండా అమ్రీన్‌ను, ఫర్హీన్‌ను చావుదెబ్బలు కొట్టాడు. అదే సమయంలో ఇంటికెళ్లి రూ.5లక్షలు తీసుకురావాలంటూ గొడవ చేశాడు. అంతటితో ఆగకుండా ఫర్హీన్‌కు మూడుసార్లు తలాక్ చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టేశాడు. ఆ తర్వాత అమ్రీన్ బానో భర్త కూడా అదే పని చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తలాక్‌పై చర్చ జరగడంతోపాటు పలువురు బాధితులు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాలు మీడియాకు చెబుతుండటంతో అమ్రీన్ కూడా బయటకొచ్చింది. అయితే, తన భర్తకు తానే విడాకులు ఇవ్వబోతున్నానంటూ ప్రకటించేసింది. తమను భౌతికంగా హింసించడమే కాకుండా అనైతిక శృంగార చేష్టలకు కూడా ఆ ఇద్దరు సోదరులు పాల్పడే వారంటూ ఆమె తన గోడును వెళ్లబోసుకుంది.