AMRI Hospital
-
మణిపాల్ చేతికి ఆమ్రి హాస్పిటల్స్
కోల్‌కతా/న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ తాజాగా ఇమామీ గ్రూప్ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్‌లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్ కంపెనీ టెమాసెక్ హోల్డింగ్స్‌కు 59% వాటాగల మణిపాల్ ఇందుకు రుణాలుసహా రూ. 2,300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆమ్రి హాస్పిటల్స్‌లో 15% వాటాతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ గ్రూప్ ఇన్వెస్టర్‌గా కొనసాగనుంది. తాజా కొనుగోలుతో మణిపాల్ హాస్పిటల్స్ దేశ తూర్పు ప్రాంతంలో కార్యకలా పాలు విస్తరించనుంది. సంయుక్త సంస్థ దేశవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాలలో 9,500 పడకలతో 33 ఆసుపత్రులను నిర్వహించనుంది. వెరసి దేశీయంగా రెండో పెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థగా ఆవి ర్భవించనుంది. సంబంధిత వర్గాల సమా చారం ప్రకారం ఆమ్రి రుణ భారం రూ.1,600 కోట్లు కాగా.. రూ.2,400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ జరిగినట్లు తెలుస్తోంది. క్లినికల్ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలుగల ఆమ్రి హాస్పిటల్స్‌ను జత కలుపుకోవడం ద్వారా భారీ నెట్‌వర్క్‌కు తెరలేవనున్నట్లు మణిపాల్ పేర్కొంది. తద్వారా దేశ తూర్పుప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఆరోగ్యపరిరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన సేవలు అందించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. అయితే మణిపాల్ 2021లో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తూర్పు భారతంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కాగా.. హెల్త్‌కేర్ రంగ మరో దిగ్గజం అపోలో హాస్పిటల్స్ 10,000 పడకల సామర్థ్యంతో 64 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. -
రోగం కుదిర్చే తీర్పు!
నిర్లక్ష్యం ఎక్కడైనా క్షమార్హం కానిదే. అందునా రోగుల ప్రాణాలతో ముడిపడి ఉండే వైద్యరంగంలో అది మరింతగా అవాంఛనీయం. కానీ, అన్ని రంగాల్లాగే వైద్యరంగంలోనూ వ్యాపారధోరణులు ముదిరిపోయాక నిర్లక్ష్యం ఒక్కటే కాదు... అనైతికత, అమానవీయత కూడా అందులో దండిగా పెరిగిపోయాయి. ‘వైద్యో నారాయణో హరి’ అన్న నానుడి అర్ధమే మారిపోయింది. వైద్యుడికీ, రోగికీ మధ్య ఉండాల్సిన బంధం బీటలువారింది. ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో... నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక రోగి ప్రాణం పోవడానికి కారణమైన కోల్‌కతాకు చెందిన ఆస్పత్రికి, అందులోని ముగ్గురు వైద్యులకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది. చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, పౌరుల ఆరోగ్యానికి భంగంకలిగిస్తే అది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమేనని స్పష్టంచేయడం బాధితులకు ఊరట కలిగిస్తుంది. అమెరికాలో చిన్నపిల్లల సైకాలజిస్టుగా పనిచేస్తూ 1998లో కోల్‌కతా వచ్చిన అనూరాధ అనే మహిళ అస్వస్థురాలైనప్పుడు ఇచ్చిన ఒక ఇంజెక్షన్ వికటించింది. కొద్దిరోజుల్లోనే ఆమె కన్నుమూశారు. అనూరాధ మరణానికి ఆమెకిచ్చిన ఇంజెక్షనే కారణమని వైద్య నిపుణులు తేల్చారు. ఆమె భర్త డాక్టర్ కునాల్ సాహా ఈ కేసుపై పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఆస్పత్రివైపునుంచి, వైద్యులవైపునుంచి జరిగిన లోపాలేమిటో నిరూపించారు. తన భార్య మృతివల్ల జరిగిన ఆదాయ నష్టాన్ని, కుటుంబానికి కలిగిన వేదనను, వ్యాజ్యానికైన ఖర్చులను లెక్కగట్టి పరిహారం ఇప్పించాలని కునాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పర్యవసానంగా ఆయనకు రూ. 5.96 కోట్ల మొత్తాన్ని పరిహారంగా నిర్ణయించి, అందుకు వడ్డీని కూడా లెక్కేసి మొత్తం రూ. 11.41 కోట్లను 8 వారాల్లో చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్ల క్రితం కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే వెలువరించింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతనికి శాశ్వత వైకల్యం తీసుకొచ్చినందుకు కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. నాడి చూసి కొన్ని అంచనాలతో రోగనిర్ధారణ చేసి, వైద్యాన్ని అందించే దశనుంచి దేన్నయినా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిర్ధారించి చికిత్సచేసే పరిస్థితులొచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు కనుమరుగై, క్లినిక్‌లు వచ్చి...అవికూడా నర్సింగ్హోంలుగా, పాలీ క్లినిక్‌లుగా రూపాంతరంచెందాయి. భారీ పెట్టుబడులు అవసరమైన అత్యాధునిక సాంకేతిక ఉపకరణాలు అందుబాటులోకొచ్చాక స్టార్ హోటళ్లను తలదన్నే రీతిలో కార్పొరేట్ ఆస్పత్రులు వెలిశాయి. ఓ మాత్రం సంపాదనపరులైనవారెవరూ ఇప్పుడు వీధి చివరన ఉండే సాధారణ వైద్యులను ఆశ్రయించడంలేదు. నేరుగా కార్పొరేట్ ఆస్పత్రులను వెదుక్కుంటూ వెళ్తున్నారు. ఆ ఆస్పత్రుల్లో అడుగుపెడితే చాలు... అంతా నయమైపోతుందన్న భ్రమల్లో ఉండిపోతున్నారు. సరిగ్గా ఈ స్థితినే ఆస్పత్రులు సొమ్ముచేసుకుంటున్నాయి. లక్షలు, కోట్లు పోసి కొనుగోలు చేసిన పరికరాలకు పనిచెబితే తప్ప లాభాలు రావన్న ఏకైక సూత్రంతో... రోగులకు అవసరమున్నా, లేకున్నా ఖరీదైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అటు తర్వాత చికిత్సల పేరిట మరిన్ని వేలు రాబడుతున్నాయి. ఇలా వేలకు వేలు ఖర్చుపెట్టినా రోగం కుదురుకుంటుందన్న ధీమా ఎవరికీ కలగటంలేదు. ఈ అనైతిక వైద్య పరీక్ష లూ, చికిత్సలూ డబ్బులు కొల్లగొట్టడంతో ఊరుకోవడంలేదు. ఆరోగ్యాన్ని సైతం గుల్లబారుస్తున్నాయి. ఫలితంగా అటు డబ్బూ పోయి, ఇటు శాశ్వత అనారోగ్యమూ దాపురించి సామాన్యులు విలవిల్లాడుతు న్నారు. కడుపునొప్పి ఉన్న మహిళలకు హిస్టరెక్టమీ ఆపరేషన్లు నిర్వహించిన వైద్యుల నిర్వాకాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు గతంలో బట్టబయలు చేశాయి. వైద్యరంగంలో కనబడుతున్న ఈ విపరీత పోకడలను అరికట్టడంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)వంటి వృత్తిగత సంస్థలు విఫలమవుతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా, దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తున్న వైద్యులనూ, ఆస్పత్రులనూ దారికి తీసుకురాకపోతే మొత్తం వైద్య వృత్తికే కళంకం ఏర్పడుతుందన్న భావన ఆ సంఘాల్లో కలగడంలేదు. తామే కొన్ని ప్రమాణాలను ఏర్పర్చుకుని, వాటిని పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత విషమించేది కాదు. ప్రభుత్వాలు సైతం ఈ విషయంలో సమగ్రమైన చట్టాలను తీసుకురాలేకపోయాయి. పర్యవసానంగా సామాన్యులకే కాదు...పలుకుబడి, హోదా ఉన్నవారికి సైతం నాణ్యమైన వైద్యం అందుతుందన్న గ్యారెంటీ లేకుండాపోయింది. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ మరణానికి సైతం సరైన చికిత్స లభించకపోవడమే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. కునాల్ సాహాకు ఈ విజయం అంత సులభంగా, అలవోకగా లభించలేదు. ఆయన ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 15 సంవత్సరాలపాటు పోరాడారు. ఒకచోట కేసే లేదని కొట్టేస్తే, మరోచోట ఈ మాత్రం పరిహారం సరిపోతుందని లెక్కేస్తే...ఆయన విసుగూ, విరామంలేకుండా న్యాయస్థానాల చుట్టూ తిరిగారు. పోయిన ప్రాణాలకు పరిహారం సమమవుతుందనుకోలేదు. చికిత్స పేరిట ప్రాణం తీసిన ఆస్పత్రిని, వైద్యులనూ దోషులుగా నిలబెట్టాలనుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి మరే ప్రాణమూ బలికాకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఆయన కోరిక నెరవేరింది. ఈ తరహా కేసుల్లో మైలురాయిగా నిలిచిపోయే ఉత్కృష్టమైన తీర్పు వెలువడింది. ఈ తీర్పు వైద్యుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వ్యక్తంచేస్తున్న ఆందోళన అర్ధంలేనిది. వృత్తే దైవంగా భావించేవారికి దీనివల్ల ఏమీకాదు. వృత్తికి ద్రోహంచేసేవారి పాలిట మాత్రమే ఇది అంకుశంలా పనిచేస్తుంది. వైద్యపరమైన నిర్లక్ష్యంతో బాధితులుగా మారినవారెందరికో ఈ తీర్పు ఒక ఆలంబనగా నిలుస్తుంది. -
వైద్య నిర్లక్ష్యానికి రూ.6 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ/కోల్‌కతా: చికిత్స చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఓ మహిళ మృతికి కారణమైనందుకు రూ. 5.96 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోల్‌కతాకు చెందిన ఏఎంఆర్ఐ ఆస్పత్రికి, ముగ్గురు వైద్యులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికాలో ఉండే భారత సంతతి వైద్యుడు కునాల్ సాహ 1998లో మార్చిలో తన భార్య అనురాధతో కలిసి భారత్‌కు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత చర్మ సంబంధిత ఇబ్బందులతో అనురాధ ‘అడ్వాన్స్డ్ మెడికేర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్- ఏఎంఆర్ఐ’ ఆస్పత్రిలో చేరారు. కానీ, చికిత్స చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అదే సంవత్సరం మే 28 మరణించారు. దీంతో కునాల్ సాహ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా.. రూ. 1.73 కోట్ల పరిహారం చెల్లించాల్సిందిగా 2011లో ఏఎంఆర్ఐ ఆస్పత్రి, వైద్యులను ఆదేశించింది. కానీ, పరిహారం పెంచాలంటూ కునాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం ఘటనపై నిశితంగా విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ సీకే ప్రసాద్, వి.గోపాలగౌడల నేతృత్వంలోని ధర్మాసనం రూ. 5.96 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా గురువారం తీర్పునిచ్చింది. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు బలరాం ప్రసాద్, సుకుమార్ ముఖర్జీలు రూ. 10 లక్షల చొప్పున, మరోవైద్యుడు వైద్యనాథ్ హాల్దార్ రూ. 5 లక్షలు, మిగతా మొత్తాన్ని ఆస్పత్రి యాజమాన్యం ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారం మొత్తాన్ని కూడా కేసు దాఖలైన 1999వ సంవత్సరం నుంచి ఏటా 6 శాతం వడ్డీ చొప్పున కలిపి ఇవ్వాలని పేర్కొంది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై కునాల్ సాహ హర్షం వ్యక్తం చేశారు. అమాయక రోగుల పట్ల నిర్లక్ష్యంగా, దారుణంగా వ్యవహరించే ఆస్పత్రులు, వైద్యులకు ఇది హెచ్చరిక పంపుతుందని.. దేశంలో వైద్య ప్రమాణాల అమలుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే.. అనురాధ మృతి చెందిన ఏఎంఆర్ఐ ఆస్పత్రికి చెందిన ఒక భవనంలో 2011 డిసెంబర్లో అగ్ని ప్రమాదం జరిగి 93 మంది మరణించారు. దాంతో ఆ ఆస్పత్రిని మూసేశారు. -
చికిత్సలో నిర్లక్ష్యం.. రూ. 5.96 కోట్లు జరిమానా
న్యూఢిల్లీ, కోల్‌కతా: చికిత్స చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఓ మహిళ మృతికి కారణమైనందుకు రూ. 5.96 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోల్‌కతాకు చెందిన ఏఎంఆర్ఐ ఆస్పత్రికి, ముగ్గురు వైద్యులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికాలో ఉండే భారత సంతతి వైద్యుడు కునాల్ సాహ 1998లో మార్చిలో తన భార్య అనురాధతో కలిసి భారత్‌కు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత చర్మ సంబంధిత ఇబ్బందులతో అనురాధ ‘అడ్వాన్స్డ్ మెడికేర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్- ఏఎంఆర్ఐ’ ఆస్పత్రిలో చేరారు. కానీ, చికిత్స చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అదే సంవత్సరం మే 28 మరణించారు. దీంతో కునాల్ సాహ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా.. రూ. 1.73 కోట్ల పరిహారం చెల్లించాల్సిందిగా 2011లో ఏఎంఆర్ఐ ఆస్పత్రి, వైద్యులను ఆదేశించింది. కానీ, పరిహారం పెంచాలంటూ కునాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం ఘటనపై నిశితంగా విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ సీకే ప్రసాద్, వి.గోపాలగౌడల నేతృత్వంలోని ధర్మాసనం రూ. 5.96 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా గురువారం తీర్పునిచ్చింది. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు బలరాం ప్రసాద్, సుకుమార్ ముఖర్జీలు రూ. 10 లక్షల చొప్పున, మరోవైద్యుడు వైద్యనాథ్ హాల్దార్ రూ. 5 లక్షలు, మిగతా మొత్తాన్ని ఆస్పత్రి యాజమాన్యం ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. -
వైద్యుల నిర్లక్ష్యం: బాధితుడికి 6 కోట్ల పరిహారం
న్యూఢిల్లీ : వైద్యరంగంలో నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. 15 ఏళ్లుగా అలుపెరగకుండా పోరాడిన బాధితునికి 6 కోట్లు పరిహారం చెల్లించాలంటూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాకు చెందిన వైద్యురాలు అనురాధా సాహా 1998లో కోల్‌కతాలోని అమ్రి ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అనురాధా సాహా మృతి చెందిందని, తనకు న్యాయం చేయాలంటూ ఆమె భర్త కునాల్ సాహా...ఎన్సీఆర్డీసీతో పాటు భారత వైద్య మండలిని ఆశ్రయించారు. ముగ్గురు వైద్యులు తప్పుడు వైద్యం చేయడం వల్లే తన భార్య మృతి చెందిందని ఆరోపించారు. అయితే ఈ కేసులో భారత వైద్య మండలి... వైద్యులు పక్షాన్నే నిలిచింది. కునాల్ సాహా ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది. దాంతో 2006లో కునాల్ సాహా సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు వైద్యులను దోషులుగా పేర్కొంటూ 2009లో తీర్పు వెలువరించింది. బాధితునికి చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించాలంటూ ఎన్సీఆర్డీసీని ఆదేశించింది. 2011లో పరిహారం విలువను కోటి 72 లక్షలుగా ఎన్సీఆర్డీసీ నిర్ణయించింది. మళ్లీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు పరిహారం విలువను కోటి 72 లక్షల నుంచి 5 కోట్ల 96 లక్షలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. ముగ్గురు వైద్యులు ఒక్కొక్కరు 10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.