వైద్యుల నిర్లక్ష్యం: బాధితుడికి 6 కోట్ల పరిహారం
వైద్యుల నిర్లక్ష్యం: బాధితుడికి 6 కోట్ల పరిహారం
Published Thu, Oct 24 2013 12:31 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
న్యూఢిల్లీ : వైద్యరంగంలో నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. 15 ఏళ్లుగా అలుపెరగకుండా పోరాడిన బాధితునికి 6 కోట్లు పరిహారం చెల్లించాలంటూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాకు చెందిన వైద్యురాలు అనురాధా సాహా 1998లో కోల్‌కతాలోని అమ్రి ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అనురాధా సాహా మృతి చెందిందని, తనకు న్యాయం చేయాలంటూ ఆమె భర్త కునాల్ సాహా...ఎన్సీఆర్డీసీతో పాటు భారత వైద్య మండలిని ఆశ్రయించారు.
ముగ్గురు వైద్యులు తప్పుడు వైద్యం చేయడం వల్లే తన భార్య మృతి చెందిందని ఆరోపించారు. అయితే ఈ కేసులో భారత వైద్య మండలి... వైద్యులు పక్షాన్నే నిలిచింది. కునాల్ సాహా ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది. దాంతో 2006లో కునాల్ సాహా సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు వైద్యులను దోషులుగా పేర్కొంటూ 2009లో తీర్పు వెలువరించింది. బాధితునికి చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించాలంటూ ఎన్సీఆర్డీసీని ఆదేశించింది. 2011లో పరిహారం విలువను కోటి 72 లక్షలుగా ఎన్సీఆర్డీసీ నిర్ణయించింది. మళ్లీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు పరిహారం విలువను కోటి 72 లక్షల నుంచి 5 కోట్ల 96 లక్షలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. ముగ్గురు వైద్యులు ఒక్కొక్కరు 10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
Advertisement
Advertisement