రోగం కుదిర్చే తీర్పు!
రోగం కుదిర్చే తీర్పు!
Published Sat, Oct 26 2013 12:39 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
నిర్లక్ష్యం ఎక్కడైనా క్షమార్హం కానిదే. అందునా రోగుల ప్రాణాలతో ముడిపడి ఉండే వైద్యరంగంలో అది మరింతగా అవాంఛనీయం. కానీ, అన్ని రంగాల్లాగే వైద్యరంగంలోనూ వ్యాపారధోరణులు ముదిరిపోయాక నిర్లక్ష్యం ఒక్కటే కాదు... అనైతికత, అమానవీయత కూడా అందులో దండిగా పెరిగిపోయాయి. ‘వైద్యో నారాయణో హరి’ అన్న నానుడి అర్ధమే మారిపోయింది. వైద్యుడికీ, రోగికీ మధ్య ఉండాల్సిన బంధం బీటలువారింది. ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో... నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక రోగి ప్రాణం పోవడానికి కారణమైన కోల్‌కతాకు చెందిన ఆస్పత్రికి, అందులోని ముగ్గురు వైద్యులకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది. చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, పౌరుల ఆరోగ్యానికి భంగంకలిగిస్తే అది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమేనని స్పష్టంచేయడం బాధితులకు ఊరట కలిగిస్తుంది.
అమెరికాలో చిన్నపిల్లల సైకాలజిస్టుగా పనిచేస్తూ 1998లో కోల్‌కతా వచ్చిన అనూరాధ అనే మహిళ అస్వస్థురాలైనప్పుడు ఇచ్చిన ఒక ఇంజెక్షన్ వికటించింది. కొద్దిరోజుల్లోనే ఆమె కన్నుమూశారు. అనూరాధ మరణానికి ఆమెకిచ్చిన ఇంజెక్షనే కారణమని వైద్య నిపుణులు తేల్చారు. ఆమె భర్త డాక్టర్ కునాల్ సాహా ఈ కేసుపై పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఆస్పత్రివైపునుంచి, వైద్యులవైపునుంచి జరిగిన లోపాలేమిటో నిరూపించారు. తన భార్య మృతివల్ల జరిగిన ఆదాయ నష్టాన్ని, కుటుంబానికి కలిగిన వేదనను, వ్యాజ్యానికైన ఖర్చులను లెక్కగట్టి పరిహారం ఇప్పించాలని కునాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పర్యవసానంగా ఆయనకు రూ. 5.96 కోట్ల మొత్తాన్ని పరిహారంగా నిర్ణయించి, అందుకు వడ్డీని కూడా లెక్కేసి మొత్తం రూ. 11.41 కోట్లను 8 వారాల్లో చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్ల క్రితం కూడా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే వెలువరించింది.
ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతనికి శాశ్వత వైకల్యం తీసుకొచ్చినందుకు కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. నాడి చూసి కొన్ని అంచనాలతో రోగనిర్ధారణ చేసి, వైద్యాన్ని అందించే దశనుంచి దేన్నయినా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిర్ధారించి చికిత్సచేసే పరిస్థితులొచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు కనుమరుగై, క్లినిక్‌లు వచ్చి...అవికూడా నర్సింగ్‌హోంలుగా, పాలీ క్లినిక్‌లుగా రూపాంతరంచెందాయి. భారీ పెట్టుబడులు అవసరమైన అత్యాధునిక సాంకేతిక ఉపకరణాలు అందుబాటులోకొచ్చాక స్టార్ హోటళ్లను తలదన్నే రీతిలో కార్పొరేట్ ఆస్పత్రులు వెలిశాయి. ఓ మాత్రం సంపాదనపరులైనవారెవరూ ఇప్పుడు వీధి చివరన ఉండే సాధారణ వైద్యులను ఆశ్రయించడంలేదు. నేరుగా కార్పొరేట్ ఆస్పత్రులను వెదుక్కుంటూ వెళ్తున్నారు. ఆ ఆస్పత్రుల్లో అడుగుపెడితే చాలు... అంతా నయమైపోతుందన్న భ్రమల్లో ఉండిపోతున్నారు. సరిగ్గా ఈ స్థితినే ఆస్పత్రులు సొమ్ముచేసుకుంటున్నాయి. లక్షలు, కోట్లు పోసి కొనుగోలు చేసిన పరికరాలకు పనిచెబితే తప్ప లాభాలు రావన్న ఏకైక సూత్రంతో... రోగులకు అవసరమున్నా, లేకున్నా ఖరీదైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అటు తర్వాత చికిత్సల పేరిట మరిన్ని వేలు రాబడుతున్నాయి.
ఇలా వేలకు వేలు ఖర్చుపెట్టినా రోగం కుదురుకుంటుందన్న ధీమా ఎవరికీ కలగటంలేదు. ఈ అనైతిక వైద్య పరీక్ష లూ, చికిత్సలూ డబ్బులు కొల్లగొట్టడంతో ఊరుకోవడంలేదు. ఆరోగ్యాన్ని సైతం గుల్లబారుస్తున్నాయి. ఫలితంగా అటు డబ్బూ పోయి, ఇటు శాశ్వత అనారోగ్యమూ దాపురించి సామాన్యులు విలవిల్లాడుతు న్నారు. కడుపునొప్పి ఉన్న మహిళలకు హిస్టరెక్టమీ ఆపరేషన్లు నిర్వహించిన వైద్యుల నిర్వాకాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు గతంలో బట్టబయలు చేశాయి. వైద్యరంగంలో కనబడుతున్న ఈ విపరీత పోకడలను అరికట్టడంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)వంటి వృత్తిగత సంస్థలు విఫలమవుతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా, దోపిడీయే లక్ష్యంగా పనిచేస్తున్న వైద్యులనూ, ఆస్పత్రులనూ దారికి తీసుకురాకపోతే మొత్తం వైద్య వృత్తికే కళంకం ఏర్పడుతుందన్న భావన ఆ సంఘాల్లో కలగడంలేదు. తామే కొన్ని ప్రమాణాలను ఏర్పర్చుకుని, వాటిని పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత విషమించేది కాదు. ప్రభుత్వాలు సైతం ఈ విషయంలో సమగ్రమైన చట్టాలను తీసుకురాలేకపోయాయి. పర్యవసానంగా సామాన్యులకే కాదు...పలుకుబడి, హోదా ఉన్నవారికి సైతం నాణ్యమైన వైద్యం అందుతుందన్న గ్యారెంటీ లేకుండాపోయింది.
మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ మరణానికి సైతం సరైన చికిత్స లభించకపోవడమే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. కునాల్ సాహాకు ఈ విజయం అంత సులభంగా, అలవోకగా లభించలేదు. ఆయన ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 15 సంవత్సరాలపాటు పోరాడారు. ఒకచోట కేసే లేదని కొట్టేస్తే, మరోచోట ఈ మాత్రం పరిహారం సరిపోతుందని లెక్కేస్తే...ఆయన విసుగూ, విరామంలేకుండా న్యాయస్థానాల చుట్టూ తిరిగారు. పోయిన ప్రాణాలకు పరిహారం సమమవుతుందనుకోలేదు. చికిత్స పేరిట ప్రాణం తీసిన ఆస్పత్రిని, వైద్యులనూ దోషులుగా నిలబెట్టాలనుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి మరే ప్రాణమూ బలికాకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఆయన కోరిక నెరవేరింది. ఈ తరహా కేసుల్లో మైలురాయిగా నిలిచిపోయే ఉత్కృష్టమైన తీర్పు వెలువడింది. ఈ తీర్పు వైద్యుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వ్యక్తంచేస్తున్న ఆందోళన అర్ధంలేనిది. వృత్తే దైవంగా భావించేవారికి దీనివల్ల ఏమీకాదు. వృత్తికి ద్రోహంచేసేవారి పాలిట మాత్రమే ఇది అంకుశంలా పనిచేస్తుంది. వైద్యపరమైన నిర్లక్ష్యంతో బాధితులుగా మారినవారెందరికో ఈ తీర్పు ఒక ఆలంబనగా నిలుస్తుంది.
Advertisement
Advertisement