సాక్షి,న్యూఢిల్లీ: ఎన్‌ఆర్‌ఐలను పోస్టల్ లేదా ఈ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ ఎన్నికల చట్టానికి కేంద్రం సవరణలు చేయనుంది.దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎం కన్విల్కార్‌తో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రం వాదనను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్‌ఆర్‌ఐలకు ఓటింగ్ హక్కుల పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్న క్రమంలో ఆయా పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని కేంద్రం కోరగా విచారణను 12 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
అంతకుముందు ఇదే కేసుకు సంబంధించి జులై 21న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదన వినిపిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను మార్చడం ద్వారా ఎన్‌ఆర్‌ఐలను ఓటు వేసేందుకు అనుమతించలేమని, చట్ట సవరణ కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment