న్యూఢిల్లీ, కోల్‌కతా: చికిత్స చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఓ మహిళ మృతికి కారణమైనందుకు రూ. 5.96 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోల్‌కతాకు చెందిన ఏఎంఆర్‌ఐ ఆస్పత్రికి, ముగ్గురు వైద్యులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అమెరికాలో ఉండే భారత సంతతి వైద్యుడు కునాల్ సాహ 1998లో మార్చిలో తన భార్య అనురాధతో కలిసి భారత్‌కు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత చర్మ సంబంధిత ఇబ్బందులతో అనురాధ ‘అడ్వాన్స్‌డ్ మెడికేర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్- ఏఎంఆర్‌ఐ’ ఆస్పత్రిలో చేరారు. కానీ, చికిత్స చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అదే సంవత్సరం మే 28 మరణించారు. దీంతో కునాల్ సాహ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా.. రూ. 1.73 కోట్ల పరిహారం చెల్లించాల్సిందిగా 2011లో ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి, వైద్యులను ఆదేశించింది.
కానీ, పరిహారం పెంచాలంటూ కునాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం ఘటనపై నిశితంగా విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ సీకే ప్రసాద్, వి.గోపాలగౌడల నేతృత్వంలోని ధర్మాసనం రూ. 5.96 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా గురువారం తీర్పునిచ్చింది. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు బలరాం ప్రసాద్, సుకుమార్ ముఖర్జీలు రూ. 10 లక్షల చొప్పున, మరోవైద్యుడు వైద్యనాథ్ హాల్దార్ రూ. 5 లక్షలు, మిగతా మొత్తాన్ని ఆస్పత్రి యాజమాన్యం ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది.