నోట్లు కాజేసిన ఎస్సై అరెస్ట్
నోట్లమార్పిడి కోసం వచ్చినవారిపై దాడికి పాల్పడి, వారి వద్ద డబ్బు కాజేసిన మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్సై ఆనంద్‌గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో నలుగురిని కూడా అరెస్టు చేసినట్లు స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎస్సై ఆనంద్‌గౌడ్, మరికొందరు ఈ నెల 12న రాత్రి కాళ్లకల్ గ్రామ శివారులో నోట్ల మార్పిడి కోసం వచ్చిన ముఠా సభ్యులను బెదిరించి, వారి నుంచి డబ్బు కాజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్సై ఆనంద్‌గౌడ్‌తో పాటు కాళ్లకల్‌కు చెందిన ఎర్ర వెంకటేశం, రాజుగౌడ్, ఫాంహౌస్ గుమాస్తా పరియాగ్ సింగ్, మనోహరాబాద్‌కు చెందిన ర్యాకల భిక్షపతిగౌడ్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రాజుగౌడ్ వద్ద రూ.21.5 లక్షలు, భిక్షపతిగౌడ్ వద్ద రూ.12.76 లక్షలను స్వాధీనం చేసుకున్నామని.. నిందితులను గజ్వేల్ కోర్టు ఎదుట హాజరుపరిచామని వెల్లడించారు. కాగా.. జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా నూతన మండలంగా ఏర్పాటైన మనోహరాబాద్ ఎస్సైగా ఆనంద్‌గౌడ్ నియమితులయ్యారు. నెలరోజుల కింద నర్సాపూర్ డివిజన్ పరిధిలోని చిల్పిచెడ్‌కు ఆయనను బదిలీ చేయగా.. తనకున్న రాజకీయ పలుకుబడితో తిరిగి 15 రోజుల క్రితం మనోహరాబాద్ ఎస్సైగా బదిలీ చేయించుకున్నారు. ఈ క్రమంలో స్థానికంగా తనకున్న పరిచయాలతో నోట్ల మార్పిడిలో దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.