జాతీయ రహదారి రక్తసిక్తం
తమిళనాడులోని హొసూరు-సూళగిరి మధ్య రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి దుర్మరణం
మృతుల్లో వేలూరు జిల్లా ఎస్ఐ
నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కార్లు
హొసూరు, న్యూస్‌లైన్ : ఏడవ నంబర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో వేలూరు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న ఆనందన్ (50)తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వివరాలు... వేలూరు జిల్లా సత్వచేరి గ్రామానికి చెందిన ఆన ందన్.. పాగాయంలో ఎస్.ఐగా పనిచేస్తున్నారు. ఇతనని సోదరుడు బాబు (46) బెంగళూరులో వ్యాపారి. శనివారం ఆనందన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బాబు కుటుంబ సభ్యులు వేలూరు నుంచి రెండు కార్లలో శనివారం అర్ధరాత్రి బెంగళూరు బయలుదేరారు.
కాశ్మీర్-క న్యాకుమారి ఏడవ నంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో హొసూరు-సూళగిరి మధ్యలో గోపనపల్లి వద్ద రోడ్డుపై చెడిపోయి నిలిపి ఉన్న లారీని వేగంగా వస్తున్న కార్లు బలంగా ఢీకొన్నాయి. వెనుకనే వస్తున్న మరో రెండు కార్లు కూడా అదుపు తప్పి ఢీకొన్నాయి. దీంతో మొదటి రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 12 మందిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఎస్.ఐ ఆనంద్ (50) ఆయన భార్య ఉమ (48), కూతురు సంధ్య (13), ఎస్.ఐ సోదరుడు బాబు (46), భార్య రమణి (40), కుమారుడు అరుణ్ (10), కారు డ్రైవర్ విల్లు (35) అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో మరో కారు డ్రైవర్ మురుగన్, షాలినీ (20), సీత (7), ఐశ్వర్య (15), దివాకర్ (4) తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హొసూరు ప్రభుత్వలో ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని హొసూరు వైద్యులు వెల్లడించారు. కాగా, అర్ధరాత్రి క్షతగాత్రుల అరుపులు, కేకలతో జాతీయ రహదారి దద్దరిల్లింది.
ప్రమాద సమాచారం అందుకున్న హొసూరు డీఎస్పీ గోపి, సిప్కాట్, సూళగిరి సీఐలు శంకర్, సుభాష్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఇదిలా ఉంటే మూడో కారులో ప్రయాణిస్తున్న రాజస్తాన్‌కు చెందిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గంటసేపు శ్రమించిన అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కణ్ణమ్మాళ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.