వైఎస్ జగన్ దీక్ష న్యాయబద్ధమైంది: విజయశాంతి
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు ఎల్లడలా మద్దతు లభిస్తోంది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ విజయశాంతి, ఆలిండియా దళిత రైతు ఫెడరేషన్ లు జననేత దీక్షను సమర్థించారు.
వైఎస్ జగన్ దీక్ష న్యాయబద్ధమైనదని, ప్రగతిశీల వాదులందరూ దీక్షకు మద్దతు పలకాలని విజయశాంతి అన్నారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వం తరఫున చర్చలు జరిపేందుకు టీడీపీ, బీజేపీలు ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు.
ఆలిండియా దళిత రైతు ఫెడరేషన్ కన్వీనర్ ఆనందరావు ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతకు ప్రాణాపాయం కల్పించడం మూర్ఖత్వమని అన్నారు. 'ప్రత్యేక హోదాపై ఎవరు పోరాటం చేసినా మద్దతిస్తానన్న చంద్రబాబు.. వైఎస్ జగన్ దీక్షను అవహేళన చేయడం సరికాదు. బాబు హిట్లర్ లా కాకుండా సీఎంలా వ్యవహరించాలి. ప్రతిపక్ష నేత ప్రాణాలతో చెలగాటమాడటం మూర్ఖత్వం. ప్రధాన మంత్రితో చర్చలు జరిపి వెంటనే ప్రత్యేక హోదాపై ప్రకటనను ఇప్పించాలి' అని ఆనందరావు పేర్కొన్నారు.