శ్రీకాళహస్తిలో ఆనం కుమారుడి వీరంగం
తిరుపతి: పదవి ఉంది.. డబ్బు ఉంది.. వ్యవస్థతో ఎలా అయినా ఆడుకోవచ్చు అనుకుంటున్నారు నేతల కుమారులు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడి కీచక పర్వం మరచిపోకముందే తాజాగా మరో నాయకుడి కుమారుడు రెచ్చిపోయాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయుడు శ్రీకాళహస్తిలో వీరంగం సృష్టించాడు.
శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తికి వెళ్లిన ఆనం శుభకర్ రెడ్డి తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ అధికారులపై చిందులు వేశాడు. దర్శనం కల్పిస్తారా లేదా అంటూ ఈవో భ్రమరాంబపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. అందుకు నిరాకరించిన ఈవో పై శుభకర్ రెడ్డి అంతు చూస్తానంటూ దుర్భాషలాడినట్టు సమాచారం. 'గతంలో ఎంతోమంది అధికారులను బదిలీ చేయించా. సీఎం చంద్రబాబు తో మాట్లాడి నీ కథ తేలుస్తా' అంటూ ఈవో భ్రమరాంబపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు శ్రీకాళహస్తిలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దర్శనం వివాదాస్పదమవుతోంది. బాపిరాజుకు ఈ రోజు ప్రత్యేక దర్శనం కల్పించడంపై ఆలయ చైర్మన్, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్ఎల్ఏ లకే లేని సౌకర్యాన్ని బాపిరాజుకు ఎలా కల్పిస్తారంటూ ఆలయ అర్చకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆగ్రహంతో భక్తుల ఎదుటే వారిపై తిట్ల పురాణానికి దిగారు.