నింగిన ఎగిసిన విజ్ఞాన కెరటం
‘జ్ఞాన పీఠ్’ అనంతమూర్తి కన్నుమూత
అనారోగ్యంతో ‘మణిపాల్’లో చికిత్స
గుండెపోటుతో మృతి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ యూఆర్. అనంతమూర్తి (81) శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దీర్ఘ కాలంగా ఆయన మూత్ర పిండాల వైఫల్యంతో బాధ పడుతున్నారు.
ఇంటిలోనే డయాలసిస్ చేసుకునే వారు. వారం కిందట ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆస్పత్రిలో చేరారు. అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)లో ఆయనకు వైద్య సేవలు అందిస్తుండగా హఠాత్తుగా గుండె పోటు రావడంతో కన్ను మూశారు. ఉదయం నుంచే ఆయన ఆరోగ్యం విషమించిందని, కృత్రిమ శ్వాసను అందించడం ద్వారా ఆయన ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని మణిపాల్ ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ సుదర్శన్ బల్లాల్ వెల్లడించారు.
మధ్నాహ్నం 12.30 గంటలకు ఆయన అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుళ వ్యవస్థలను కల్పించడం ద్వారా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మూత్ర పిండాల వైఫల్యంతో బాధ పడుతున్నప్పటికీ అనంత మూర్తి విస్తృతంగా ప్రయాణాలు చేసేవారని, దీని వల్ల గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. ఆరు నుంచి ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం ఆయన ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షించిందని తెలిపారు.
అభ్యుదయ భావజాలం
శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా మేలిగె గ్రామంలో 1932 డిసెంబరు 21న ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి జన్మించారు. ఇప్పటి వరకు కర్ణాటకలో ఎనిమిది మందికి జ్ఞాన పీఠ్ పురస్కారాలు లభించగా, అనంతమూర్తి ఆరో వారు. తన సాహితీ సేవలకు గుర్తింపుగా 1994లో ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. పద్మ భూషణ్ అవార్డు కూడా ఆయనను వరించింది.
2013లో మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు ఆయన ఫైనలిస్టు కూడా. 1965లో రాసిన ‘సంస్కార’ నవలతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. అణువణువునా అభ్యుదయ భావజాలం కలిగిన అనంతమూర్తి రాసిన ఆ నవల వెండి తెరకెక్కి, దేశంలో సినిమా దిశనే మార్చివేసింది. ‘ఘటశ్రద్ధ’, ‘భారతీపుర’, ‘అవస్థే’, ‘భావ’ అనే రచనలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.
ఈ ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. నరేంద్ర మోడీ ఎన్నికలలో గెలుపొంది, ప్రధాని అయితే తాను ఈ దేశాన్ని విడిచి పోతానని ప్రకటించారు. అనంతరం తన వైఖరిని మార్చుకుని, భావోద్వేగానికి గురై ఆ ప్రకటన చేశానని వివరణ ఇచ్చారు. మోడీ ప్రధాని పదవి చేపట్టాక మంగళూరు నుంచి కొందరు ఆకతాయిలు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ఆయనకు విమాన టికెట్‌ను పంపిన వైనం విదితమే.