anantavaram
-
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు 12 నుంచి గ్రామసభలు
తాడికొండ: రాజధానిలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలతో అమరావతి మెట్రోపాలిటన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటూ రాజధాని అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని నాన్ పూలింగ్ గ్రామాల ప్రజలు తమను కూడా మున్సిపాలిటీలో చేర్చాలని కోరిన నేపథ్యంలో ఆయా గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా తుళ్ళూరు మండలంలోని పూలింగ్‌కు భూములిచ్చిన 16 గ్రామాలతో పాటు నాన్ పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను కలుపుతూ 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా శుక్రవారం గ్రామసభల షెడ్యూల్ ప్రకటించారు. ఈ గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, వివరణలు సేకరించి తీర్మానం చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. తుళ్ళూరు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం ఈవోఆర్డీ సత్యకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామసభల షెడ్యూల్ 12వ తేదీ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13వ తేదీ దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14వ తేదీ వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15వ తేదీ నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి, 16వ తేదీ మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17వ తేదీ శాఖమూరు, నేలపాడు, తుళ్ళూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలకు హాజరై వారి అభిప్రాయాలను తెలపాలని ఎంపీడీవో కోరారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం 712వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 712వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహర దీక్షల్లో శుక్రవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులను మోసగించి మూడుపంటలు పండే 33 వేల ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్న చంద్రబాబు వారికి ఏం న్యాయం చేశాడో చెప్పాలన్నారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేత అనితకు బ్యాంకు నోటీసులు) రాష్ట్రంలోని 5 కోట్లమంది ప్రజల సంపదను ఒక ప్రాంతంలోనే కుమ్మరిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహా నగరాల సరసన అమరావతిని చేరుస్తానంటూ మోసపూరిత హామీలతో చంద్రబాబు 29 గ్రామాల రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించి భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆశల ఉగాది
విజయవాడ : నూతన రాజధాని తుళ్లూరు మండలం అనంతవరంలో శనివారం ఉగాది వేడుకలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఇందుకోసం రూ.5కోట్ల నిధులు మంజూరుచేసింది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగజ్జనని కనకదుర్గమ్మ ఆశీస్సులతో తయారుచేసే షడ్రుచుల ఉగాది పచ్చడితో ఈ కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే, కేవలం రాజధాని అని ప్రకటించడమే కాదు.. ఉత్సవాలు నిర్వహించడమే కాదు.. రాజధాని ప్రాంత ప్రజల జీవనం షడ్రుచుల సమ్మేళనంగా సాగేందుకు, వారి ఆశల్లో ఉగాది ఉషస్సు కనిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆశల ఉపాధి అందివ్వాలి.. నవ్యాంధ్రప్రదేశ్‌కు సరికొత్త రాజధాని తుళ్లూరేనని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ భవిష్యత్తు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్నారు. రాజధాని నేపథ్యంలోనే విద్య, వైద్యం, కమ్యూనికేషన్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా రానున్నాయి. ఇందులో భాగంగా సింగపూర్, జపాన్ వంటి దేశాల నుంచి మేధావులు నగరాన్ని సందర్శిస్తున్నారు. వీటి ద్వారా అయినా యువతకు ఉపాధి కల్పించాలి. వారి బంగారు భవితకు పూలబాట వేయాలి. పర్యాటకంగా పరిఢవిల్లాలి.. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలి. కృష్ణాతీర ప్రాంతంతో పాటు కొల్లేరు సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాజధానికి మంచి పేరు లభిస్తుంది. రాజధాని రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి కుటుంబాల్లో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారికి పరిహారం పెంపుతో పాటు విద్య, ఉద్యోగావకాశాలు కల్పించాలి. -
అనంతవరం ముస్తాబు
తుళ్లూరు మండలంలో ప్రభుత్వ ఉగాది వేడుకకు ఏర్పాట్లు పూర్తి నేటి ఉదయం 8 గంటలకు సీఎం రాక పంచాంగ శ్రవణానికి ప్రత్యేక వేదిక భారీ బందోబస్తు గుంటూరు : నూతన రాష్ట్రంలో తొలి ఉగాది వేడుకలకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామం ముస్తాబైంది. రాజధానిలో తొలిసారిగా అనంతవరంలో అధికారికంగా ఉగాది పండుగ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. ఇందుకు తగిన విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామంలోని నాలుగు ఎకరాల స్థలంలో సీఎం, ప్రముఖుల వేదిక, పంచాంగ శ్రవణం వేదిక, సంప్రదాయ నృత్యాలకు ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటుచేశారు. వేలాది మంది సమక్షంలో ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రి రాక అనంతవరంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొననున్నారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మించారు. కొండపైకి రెండు బస్సులను ఏర్పాటుచేసి అందులో సీఎంతోపాటు ప్రముఖులను వేంకటేశ్వరస్వామి దర్శనానికి తీసుకువెళ్లే ఏర్పాటుచేశారు. నాలుగుచోట్ల పార్కింగ్ ప్రదేశాలు, మూడుచోట్ల ఉచిత వైద్యశిబిరాలను సిద్ధం చేశారు. చంద్రబాబు ఉదయం 8 గంటలకు అనంతవరం చేరుకుని, కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శిం చుకుంటారు. ఆ తరువాత వేడుకల్లో పాల్గొంటారు. పురస్కారాలు-రైతులకు సన్మానం ఉగాది వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట వ్యక్తులను సత్కరించనుంది. ఇప్పటికే కొంతమందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ రైతులతో పాటు భూసమీకరణకు భూములు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి సన్మానించనున్నట్లు ప్రకటించారు. విధుల్లో 2,500 మంది పోలీసులు వేడుకల బందోబస్తు విధుల్లో సుమారు 2,500 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 50వేల మంది రానున్నట్టు అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. టీటీడీ సిద్ధాంతి తంగిరాల వేంకట పూర్ణచంద్రప్రసాద్ పంచాంగ పఠనం చేస్తారు. -
'చంద్రబాబును నమ్మలేకపోతున్నాం'
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నమ్మలేకపోతున్నామని శాఖమూరు, అనంతవరం గ్రామాల రైతులు చెప్పారు. రాజధాని కోసం భూములు ఇస్తే, రుణమాఫీలా చేస్తారేమోనని భయంగా ఉందన్నారు. భూములు ఇవ్వడానికి పలు గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రైతులు, కూలీల అభిప్రాయం తెలుసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యులు ఈరోజు ఆయా గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు, కూలీల అభిప్రాయాలు తెలుసుకునేందుకే తాము ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఏ వర్గానికి నష్టం జరిగినా పోరాటానికి తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు. కూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిన తరువాతే భూమిని సేకరించాలని వారు అన్నారు. రైతుల డిమాండ్లు అన్నిటినీ ఏపీ ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ** -
రాష్ర్టస్థాయి ఎడ్ల పోటీల విజేత కృష్ణా జిల్లా జత
అనంతవరం (కొల్లూరు): రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందేల్లో కృష్ణా జిల్లా ఎడ్లు సత్తా చాటాయి. అత్యధిక దూరం బరువు లాగి ప్రథమ బహుమతి గెల్చుకున్నాయి. కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు సోమవారం ముగిశాయి. రెండోరోజు పోటీల్లో కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన సూరపనేని వేణుగోపాలరావుకు చెందిన ఒక ఎద్దు, ఘంటసాలకు చెందిన బండి పరాస్పరరావు ఎద్దు రెండు కలిసి 2785.7 అడుగుల దూరం బరువు లాగి మొదటి బహుమతిగా రూ.20 వేలు నగదు పొందాయి. అదేవిధంగా చెరుకుపల్లి మండలం, పగిడివారిపాలేనికి చెందిన కుంచన గోపాలరెడ్డి ఎడ్ల జత 2572.6 అడుగులు దూరం లాగి రెండవ బహుమతి(రూ.15వేలు) దక్కించుకున్నాయి. అనంతవరం గ్రామానికి చెందిన దూళిపూడి రంగయ్య మెమోరియల్ ఎడ్లజత 2540.10 అడుగుల దూరం లాగి మూడవ బహుమతి(రూ.10వేలు) సాధించాయి. ప్రకాశం జిల్లా తోటవానిపాలేనికి చెందిన రాయపాటి లక్ష్మీపతి ఎడ్ల జత 2500 అడుగులు దూరం లాగి నాలుగవ బహుమతి(రూ. 5 వేలు) పొందాయి. ఆయా ఎడ్ల యజమానులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ కనగాల మధుసూధన్ ప్రసాద్, రైతులు యలవర్తి కోటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.