రాష్ర్టస్థాయి ఎడ్ల పోటీల విజేత కృష్ణా జిల్లా జత
అనంతవరం (కొల్లూరు): రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందేల్లో కృష్ణా జిల్లా ఎడ్లు సత్తా చాటాయి. అత్యధిక దూరం బరువు లాగి ప్రథమ బహుమతి గెల్చుకున్నాయి. కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు సోమవారం ముగిశాయి. రెండోరోజు పోటీల్లో కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన సూరపనేని వేణుగోపాలరావుకు చెందిన ఒక ఎద్దు, ఘంటసాలకు చెందిన బండి పరాస్పరరావు ఎద్దు రెండు కలిసి 2785.7 అడుగుల దూరం బరువు లాగి మొదటి బహుమతిగా రూ.20 వేలు నగదు పొందాయి.
అదేవిధంగా చెరుకుపల్లి మండలం, పగిడివారిపాలేనికి చెందిన కుంచన గోపాలరెడ్డి ఎడ్ల జత 2572.6 అడుగులు దూరం లాగి రెండవ బహుమతి(రూ.15వేలు) దక్కించుకున్నాయి. అనంతవరం గ్రామానికి చెందిన దూళిపూడి రంగయ్య మెమోరియల్ ఎడ్లజత 2540.10 అడుగుల దూరం లాగి మూడవ బహుమతి(రూ.10వేలు) సాధించాయి.
ప్రకాశం జిల్లా తోటవానిపాలేనికి చెందిన రాయపాటి లక్ష్మీపతి ఎడ్ల జత 2500 అడుగులు దూరం లాగి నాలుగవ బహుమతి(రూ. 5 వేలు) పొందాయి. ఆయా ఎడ్ల యజమానులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ కనగాల మధుసూధన్ ప్రసాద్, రైతులు యలవర్తి కోటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.