Ongole breed
-
‘ఒంగోలు’ జాతి పరిరక్షణకు గుర్తింపు
సాక్షి, అమరావతి: అరుదైన, అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో కృషిచేస్తున్న శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరు లాంలోని పశుపరిశోధన స్థానాన్ని బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2023 వరించింది. జాతీయస్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషిచేసే పరిశోధన సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. గతేడాది పుంగనూరు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తున్న పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు లభించింది. ఈ ఏడాది ఒంగోలు జాతి పరిరక్షణకు కృషిచేస్తున్న పరిశోధన స్థానానికి ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును ప్రకటించారు. కిసాన్ దివస్ సందర్భంగా ఈ నెల 23న హరియాణలోని కర్నల్ళక్ష జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసాపత్రం, నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు ఒంగోలు జాతికి శతాబ్దాల చరిత్ర ఒంగోలు జాతి పశువుల స్వస్థలం ఒకప్పటి ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట తాలూకాలైనప్పటికీ వీటి పుట్టినిల్లు దక్షిణాన పెన్నా, ఉత్తరాన కృష్ణానదుల మధ్యకు వ్యాపించింది. 1900 దశకంలో ప్రతి రైతు దగ్గర నాలుగు నుంచి ఎనిమిది ఒంగోలు ఆవులుండేవి. కానీ క్రమేపీ ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరాయి. మంచి పాలసార కలిగిన జాతిగా ఇవి అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ఏ వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి, వ్యా«ధినిరోధక శక్తి కలిగి ఉండడంతో పాటు భారీ శరీరంతో ఆకర్షణీయంగా ఉండడంతో ఒంగోలు జాతిపశువులు విదేశీయులను విశేషంగా ఆకర్షించాయి. ఫలితంగా తొలుత 1875లో బ్రెజిల్, 1885లో అమెరికా వీటిని తమ దేశానికి తీసుకెళ్లాయి. క్రమంగా ఒంగోలు జాతి అక్కడి నుంచి లాటిన్ అమెరికా దేశాలకు విస్తరించింది. బ్రెజిల్లో ఒంగోలు జాతిని నెలోర్, సంబా ఒంగోలు జాతిగా పిలుస్తారు. మన ఒంగోలు, గిర్, కాంక్రెజ్ జాతుల కలయికతో ఇండుబ్రెజిల్ జాతిని అభివృద్ధి చేశారు. అలాగే జమైకాలో ఒంగోలు జాతి ద్వారా బ్రాహ్మన్, వెనెజ్యులాలో ప్రిడియన్, ఒంగోలు జాతుల కలయికతో ఒంక్యాంపో అనే కొత్తజాతిని అభివృద్ధి చేశారు. ఐవీఎఫ్ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధి 2019లో ‘ఐవీఎఫ్–ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ (ఐవీఎఫ్అండ్ఈటీ) ద్వారా మేలు జాతి ఆవుల అభివృద్ధి ప«థకానికి రూ.2.39 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యుత్తమ జన్యు లక్షణాలు, మంచి పాలసార గలిగిన దేశీ ఆవుల సంతతిని అభివృద్ది చేయుడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యుత్తమమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా మేలు జాతి ఒంగోలు, పుంగనూరు జాతి పిండాలు ఉత్పత్తి చేసి తద్వారా ఆ జాతుల పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ప్రస్తుతం 450 దేశీయ మేలుజాతి ఒంగోలు పశుసంపద కలిగిన లాం పశుపరిశోధన స్థానం ఒంగోలు జాతి ప్రత్యుత్పత్తి, జీవ సాంకేతికతలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఉంది. అవార్డుతో మరింత బాధ్యత ఒంగోలు జాతి పరిరక్షణ కోసం దశాబ్దాలుగా కృషిచేస్తున్నప్పటికీ.. నాలుగున్నరేళ్లుగా ఐవీఎఫ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మేలుజాతి ఒంగోలు ఆవుల అభివృద్ధితో విశేష గుర్తింపు లభించింది. గుంటూరు పశుపరిశోధన స్థానాం ద్వారా చేస్తున్న నిర్విరామ కృషికి గుర్తింపుగా హరియాణలోని కర్నల్లోగల ఐసీఏఆర్–నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రిసోర్సస్ (ఐసీఏఆర్ అండ్ ఎన్బీఏజీఆర్) నుంచి ‘జాతి పరిరక్షణ అవార్డు–2023’ లభించింది. ఈ అవార్డు ద్వారా ఒంగోలు జాతి పరిరక్షణ, అభివృద్ధి కోసం మరిన్ని పరిశోధనలు చేసేందుకు యూనివర్సిటీకి మరింత తోడ్పాటు లభించనుంది. – ప్రొఫెసర్ సర్జన్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో భారీగా పెరిగిన ఒంగోలు జాతి పశుసంతతి మన దేశంలో వీటిసంఖ్య క్రమేపి తగ్గి అంతరించిపోతున్న వాటి జాబితాలో చేరడంతో ఒంగోలు జాతి గోవుల అభివృద్దికి శ్రీకారం చుట్టారు. 1926లో ఏర్పాటైన గుంటూరు లాంలోని పరిశోధన స్థానం 1972 నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషిచేస్తోంది. వంద మేలు జాతి ఒంగోలు ఆబోతుల నుంచి దాదాపు 11 లక్షల వీర్య మోతాదులు తయారు చేసి తెలుగు రాష్ట్రాల రైతులకు అందజేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఈ జాతి పశుసంపద అభివృద్ధి చెందింది. దేశంలో సుమారు ఏడులక్షల ఒంగోలు గోసంతతి ఉండగా, ఒక్క ఏపీలోనే నాలుగు లక్షలకుపైగా వీటి సంఖ్య పెరిగింది. ఇటీవల మేఘాలయ రాష్ట్ర సంవర్ధకశాఖకు ఒంగోలు జాతి వీర్యంతో పాటు కోడెదూడలను సరఫరా చేశారు. ఒంగోలు జాతి పరిరక్షణ కోసం వివిధ ప్రాజెక్టుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పాటు శ్రీవేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం నిర్విరామ కృషిచేస్తోంది. -
27 నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు
పటమట (విజయవాడతూర్పు) : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి కీలకస్థానముందని, వ్యవసాయ రంగానికి చేయూతగా ఉండే పశువులను కుటుంబ సభ్యులుగా చూసుకోవటం అనాదిగా ఆనవాయితీగా వస్తోందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో పటమటలంకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పటమటలోని వెర్టెక్స్ స్థలంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 27న ఆరుపళ్ల విభాగంలో, 28న వ్యవసాయ విభాగంలో, 29వ తేదీ సబ్‌జూనియర్స్, జూనియర్స్ విభాగంలో, 30వ తేదీ సీనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతాయని వివరించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన జతలకు నగదు పురస్కారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 60 జతల ఎడ్ల పేర్లు రిజిస్ట్రేషన్ జరిగిందని, రోజుకు 10–12 జతలకు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు 13వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు అన్నాబత్తుని బాబీ, కమిటీ సభ్యులు యలమంచిలి దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
'ఒంగోలు జాతి'పై ఒప్పందాలు వద్దు
* కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వినతి * బ్రెజిల్ వ్యవసాయ మంత్రితోనూ భేటీ * సాంకేతిక సహకారంపై విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: ఒంగోలు జాతి పశువుల కృత్రిమ పిండాలను బ్రెజిల్‌కు ఇచ్చేందుకు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని వైఎస్సార్సీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే బ్రెజిల్ వ్యవసాయ మంత్రిని కలసి పశుగణాభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపుపై తగిన సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఆయన శనివారం ఉదయం ఢిల్లీలో వారితో సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. 'ఈరోజు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి మాట్లాడాను. దేశానికి తలమాణికమైన ఒంగోలు జాతి పశువులకు సంబంధించి మనకు గల హక్కులను కాపాడాలని కోరాం. అనధికారికంగానే బ్రెజిల్ ఒంగోలు జాతిని అభివృద్ధి పరుచుకుంది. అధికారికంగా ఇస్తే ఇక మొత్తం హక్కులు వాళ్లకే దక్కే ప్రమాదం ఉందని చెప్పాం. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. భారత దేశ ఆస్తి అయిన ఒంగోలు పశువులపై ఎలాంటి హక్కును బ్రెజిల్‌కు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు' అని తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో పొగాకు రైతుల విషయమై కూడా మాట్లాడినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో 34 మంది రైతులు చనిపోగా అందులో 17 నుంచి 18 మంది పొగాకు రైతులేనని తెలిపారు. -
ఒంగోలు జాతి అంతరించిపోవడం లేదు
వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి ప్రశ్నకు మంత్రి బలియన్ సమాధానం న్యూఢిల్లీ: దేశంలో ఒంగోలు జాతి పశువులు అంతరించిపోవడంలేదని, వాటి సంఖ్య 2,57,661గా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బలియన్ స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్ల నుంచి 40 కోట్లు విలువ ఉన్న ఒంగోలు ఎద్దుల జీవ ద్రవ్యా న్ని తీసుకోడానికి బ్రెజీలిన్ అనుమతులు కోరడానికి సంబంధించిన సమాచారంపై పొంగులేటి వివరాలు కోరారు. చెన్నైలోని జాతీయ జీవ వైవిధ్య మండలి (ఎన్బీఏ) నుంచి ఒంగోలు జాతి పశువుల జీవద్రవ్యం(జెర్మ్ ప్లాస్మ్) తీసుకోవడానికి బ్రెజీలి యన్ అనుమతులు కోరుతున్న విషయం వాస్తవమేనని మంత్రి బదులిచ్చారు. జీవ ద్రవ్య సదుపాయం, లాభాల భాగస్వామ్యంపై ఎన్బీఏ నిపుణల కమిటీని 2005లో ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఎన్బీఏకు అందే దరఖాస్తుల పరిశీలనకు సమయానుసారంగా కమిటీ తిరిగి ఏర్పాటవుతుందని తెలిపారు. -
14 న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన
కడప అగ్రికల్చర్ : ఈనెల 14వ తేదీన అనంపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశువుల అందాల పోటీలు, బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒంగోలు జాతి పశుపరిక్షణ సమితి అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ పోటీలు ఉంటాయని అన్నారు. తాడిపత్రిలోని నూతన మున్సిఫల్ కార్యాలయ సమీపంలో ఈ పోటీలు ఉంటాయని తెలిపారు. పాలపళ్ల నుంచి ఎనిమిది పళ్లతో ఉన్న పశువులను ఈ పోటీలకు తీసుకు రావచ్చని అన్నారు. ఈ పోటీలలో పశువులను, పక్షులను తీసుకువచ్చే వారికి అన్ని వసతి సదుపాయాలు కల్పిస్తామని పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న ఒంగోలు జాతి పశువులున్న వారు ఈ పోటీలకు పశువులను, పక్షులను ప్రదర్శనకు తీసుకువెళ్లవచ్చని తెలిపారు. ప్రతి పోటీలో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారన్నారు. -
ఒంగోలు గిత్త అదిరింది..
పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. కనుపర్తిపాడు సమీపంలోని ట్రస్ట్ మైదానంలో మూడురోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రాష్ట్ర నలు మూలల నుంచి ఒంగోలు జాతి గిత్తలు, కోడెదూడలు, ఆవులు తరలి రావడంతో వాటిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నిర్వాహకులు పశువుల కోసం ప్రత్యేక టెంట్లు, వెద్య సేవలు ఏర్పాటు చేశారు. - నెల్లూరు -
రాష్ర్టస్థాయి ఎడ్ల పోటీల విజేత కృష్ణా జిల్లా జత
అనంతవరం (కొల్లూరు): రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందేల్లో కృష్ణా జిల్లా ఎడ్లు సత్తా చాటాయి. అత్యధిక దూరం బరువు లాగి ప్రథమ బహుమతి గెల్చుకున్నాయి. కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు సోమవారం ముగిశాయి. రెండోరోజు పోటీల్లో కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన సూరపనేని వేణుగోపాలరావుకు చెందిన ఒక ఎద్దు, ఘంటసాలకు చెందిన బండి పరాస్పరరావు ఎద్దు రెండు కలిసి 2785.7 అడుగుల దూరం బరువు లాగి మొదటి బహుమతిగా రూ.20 వేలు నగదు పొందాయి. అదేవిధంగా చెరుకుపల్లి మండలం, పగిడివారిపాలేనికి చెందిన కుంచన గోపాలరెడ్డి ఎడ్ల జత 2572.6 అడుగులు దూరం లాగి రెండవ బహుమతి(రూ.15వేలు) దక్కించుకున్నాయి. అనంతవరం గ్రామానికి చెందిన దూళిపూడి రంగయ్య మెమోరియల్ ఎడ్లజత 2540.10 అడుగుల దూరం లాగి మూడవ బహుమతి(రూ.10వేలు) సాధించాయి. ప్రకాశం జిల్లా తోటవానిపాలేనికి చెందిన రాయపాటి లక్ష్మీపతి ఎడ్ల జత 2500 అడుగులు దూరం లాగి నాలుగవ బహుమతి(రూ. 5 వేలు) పొందాయి. ఆయా ఎడ్ల యజమానులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ కనగాల మధుసూధన్ ప్రసాద్, రైతులు యలవర్తి కోటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.