‘వర్డ్ పవర్ చాంపియన్‌షిప్’లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులకు బహుమతులు
సత్ఫలితాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషి
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా విభా, లీప్ ఫార్వార్డ్ సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్రానికి రెండు బహుమతులు సాధించారు. గత నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులు ఈ నెల 12న ముంబైలో జరిగిన గ్రాండ్ ఫినాలే పోటీల్లో పాల్గొన్నారు.
ఫైనల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి బి.రేవంత్‌కుమార్ రెండో స్థానం, ఐదో తరగతి విద్యార్థి అనిల్‌కుమార్ బాణావత్ మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను అంచనా వేసేందుకు జాతీయ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ దేశంలోనే అతిపెద్ద పోటీ కార్యక్రమం. ఈ పోటీలో ఏపీ నుంచి ఐదుగురు విద్యార్థులు పాల్గొనగా, ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి అభినందించారు.
ఈఎల్పీ ద్వారా శిక్షణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు 2021లో ప్రభుత్వం ఇంగ్లిష్ లిటరసీ ప్రోగ్రామ్(ఈఎల్పి)ను ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆరీ్టతో విభా, లీప్ ఫార్వర్డ్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్ ద్వారా 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలను సులభంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. కనిమెర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడంతో ప్రభుత్వం చేపట్టిన ఈఎల్పీ సత్ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment