అనంతవరం ముస్తాబు
తుళ్లూరు మండలంలో ప్రభుత్వ ఉగాది వేడుకకు ఏర్పాట్లు పూర్తి
నేటి ఉదయం 8 గంటలకు సీఎం రాక
పంచాంగ శ్రవణానికి ప్రత్యేక వేదిక భారీ బందోబస్తు
గుంటూరు : నూతన రాష్ట్రంలో తొలి ఉగాది వేడుకలకు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామం ముస్తాబైంది. రాజధానిలో తొలిసారిగా అనంతవరంలో అధికారికంగా ఉగాది పండుగ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. ఇందుకు తగిన విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామంలోని నాలుగు ఎకరాల స్థలంలో సీఎం, ప్రముఖుల వేదిక, పంచాంగ శ్రవణం వేదిక, సంప్రదాయ నృత్యాలకు ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటుచేశారు. వేలాది మంది సమక్షంలో ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఇదే ప్రథమం.
ముఖ్యమంత్రి రాక
అనంతవరంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొననున్నారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ నిర్మించారు. కొండపైకి రెండు బస్సులను ఏర్పాటుచేసి అందులో సీఎంతోపాటు ప్రముఖులను వేంకటేశ్వరస్వామి దర్శనానికి తీసుకువెళ్లే ఏర్పాటుచేశారు. నాలుగుచోట్ల పార్కింగ్ ప్రదేశాలు, మూడుచోట్ల ఉచిత వైద్యశిబిరాలను సిద్ధం చేశారు. చంద్రబాబు ఉదయం 8 గంటలకు అనంతవరం చేరుకుని, కొండపై కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శిం చుకుంటారు. ఆ తరువాత వేడుకల్లో పాల్గొంటారు.
పురస్కారాలు-రైతులకు సన్మానం
ఉగాది వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట వ్యక్తులను సత్కరించనుంది. ఇప్పటికే కొంతమందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ రైతులతో పాటు భూసమీకరణకు భూములు ఇచ్చిన రైతులను ముఖ్యమంత్రి సన్మానించనున్నట్లు ప్రకటించారు.
విధుల్లో 2,500 మంది పోలీసులు
వేడుకల బందోబస్తు విధుల్లో సుమారు 2,500 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 50వేల మంది రానున్నట్టు అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. టీటీడీ సిద్ధాంతి తంగిరాల వేంకట పూర్ణచంద్రప్రసాద్ పంచాంగ పఠనం చేస్తారు.