తెలుగు అకాడమీని పునరుద్ధరిస్తాం
- సంగీత, నాటక అకాడమీలు కూడా..
- ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
- ప్రముఖులకు పురస్కారాల ప్రదానం
విజయవాడ కల్చరల్ : తెలుగు అకాడమీని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అలాగే సంగీత, నాటక అకాడమీలను కూడా పునరుద్ధరిస్తామని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి గతంలోనే ఒక కమిటీ వేశామని, తాజాగా ప్రాధికార కమిటీని నియమించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో హేవళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం, వ్యవసాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు ప్రచురించిన పంచాంగాలను ఆవిష్కరించారు.
అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు 2017 సంవత్సరానికి కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు భాషా వైభవాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూచిపూడి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,000 పాఠశాలల్లో 50 వేల మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పల్లె రఘునా«థరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, బి.గోపాల కృష్ణారెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, భాషా–సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగుపల్లి శ్రీకాంత్, సంచాలకుడు డి.విజయభాస్కర్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర :వేదాంతం
వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగ పఠనం సభికులను ఆకట్టుకుంది. హేవళంబి అంటే బంగారు తోరణమని, ఏడాదంతా జీవన యాత్ర శుభప్రదంగా జరుగుతుందని చెప్పారు. సకాలంలో వర్షాలు పడతాయని, రైతులకు తృణధాన్యాలకు గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు. వ్యవసాయ పంచాంగాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త కూర్మారావు వివరించారు.