'ప్రతి నెల ఒక రోజు జీతం రాజధానికి ఇవ్వాలి'
గుంటూరు: ఉగాది వేడుకల్లో భాగంగా రాజధానిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా తుళ్లురు మండలం అనంతవరంలో కొత్త ప్రకటన చేశారు. రాజధాని నిర్మాణానికి త్వరలో విరాళాల సేకరణ కోసం కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతినెల సంపాదనలో ఒక రోజు వేతనాన్ని రాజధానికి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ప్రతినెలా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి ఊరు, ప్రతి వ్యక్తి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2018 జూన్ 2 లోపు రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఉభయగోదావరి జిల్లాల ప్రజల పూర్తి అంగీకారం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పట్టిసీమ ఎలా కడతారని తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుతున్నారు... సముద్రంలోకి వెళ్లే గోదావరి జలాలను వాడుకునే స్వేచ్ఛ మనకుందని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరు చెప్పినా వినను... పట్టిసీ ప్రాజెక్టు కట్టి తీరుతానన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుంది... ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉందని... తొందరలోనే రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. నేను చేసిన అభివృద్ధి వల్లే తెలంగాణకు ఆదాయం వస్తుందని చంద్రబాబు చెప్పారు.