‘మాహిష్మతి’ రహస్యం చంద్రబాబుకు తెలుసా?
‘మాహిష్మతి’ రహస్యం చంద్రబాబుకు తెలుసా?
Published Thu, Sep 21 2017 3:27 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1994, డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. ఎన్టీరామారావు ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. నాటి ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలోని 294 సీట్లకు గాను మిత్రపక్షాలతో కలుపుకొని తెలుగుదేశం పార్టీకి 250 సీట్లు వచ్చాయి. ఒక్క తెలుగుదేశం పార్టీకే 226 సీట్లు రాగా, అంతకుముందు పాలకపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు వచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు అధికార పీఠానికి ఎటువైపు నుంచి కూడా కనుచూపు మేరలో ముప్పు వాటిల్లే అవకాశాలే నాడు లేవు. అయినప్పటికీ ఆయన్ని వాస్తు శంక పీడించ సాగింది. అసెంబ్లీలోకి ఎన్టీ రామారావు వెళుతున్న మార్గం సరైన దిశలో లేదని, మరో దిక్కున రోడ్డు మార్గాన్ని నిర్మించాలని ఆయన వాస్తు సలహాదారు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే సచివాలయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వేద పండితులతో వాస్తు పూజలు చేయించారు. అయినప్పటికీ కొన్ని వారాల్లోనే ఆయన్ని అధికారం పీఠం నుంచి కూలదూసి ఆ స్థానంలో ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఎంతో మానసిక క్షోభకు గురైన ఎన్టీ రామారావు ఆ తర్వాత కొన్ని వారాలకే కన్నుమూశారు.
ఈ అనుభవంతో కూడా ఎవరికి వాస్తు పట్ల కనువిప్పు కలుగుతున్నట్లు లేదు. కాలక్రమంలో రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మంచి మెజారిటీతో విజయం సాధించడంతో కె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు కూడా వాస్తు శంక పట్టుకుంది. అసలు సచివాలయానికే వాస్తు బాగా లేదని నమ్ముతున్న ఆయన సచివాలయాన్ని సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్‌కు మారుస్తున్నారు. ఇక రాష్ట్రం విడిపోయాక ఆంధ్రా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను తలదన్నేలా అమరావతిలో రాష్ట్ర రాజధానిని నిర్మించాలనుకున్నారు. నగరంలో ఒక్క పెట్రోలు బంకు కూడా లేకుండా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు నడిచే విషాల రహదారులతో కాలుష్యరహిత నగరంగా అమరావతిని నిర్మించాలని కలగన్నారు.
రాజధాని ప్రణాళికను రూపొందించేందుకు అర్కిటెక్చర్‌లో ప్రతిష్టాత్మకమైన ‘ప్రిట్జ్‌కర్ ప్రైజ్’ సాధించిన రెండు సంస్థలు, భారత్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ల్లో ఒకరైన బీవీ దోషిని ఎంపిక చేశారు. తర్వాత షార్ట్‌లిస్ట్ చేసి ‘మాకి అండ్ అసోసియేట్స్’కు ప్లాన్ అప్పగించారు. వారు ప్లాన్‌గీసి చూపించగా, రాజధాని నగరంలోని అన్ని భవనాలు వాస్తుకు అనుకూలంగా తూర్పు, ఉత్తరవైపు ద్వారా బంధాలు ఉండేలా డిజైన్ చేయాలని చంద్రబాబు సూచించారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా కూడా ఉండాలని అన్నారు. వాస్తు ప్రకారం దిక్కులు మార్చి, వాస్తు పూజలు చేయించిన తన మామకు జరిగిన మంచేమిటో ఆయన అప్పుడే మరచిపోయినట్టున్నారు. అన్ని షరతులను ఒప్పుకొని రీడిజైన్లను సమర్పించినప్పటికీ గత డిసెంబర్ నెలలో చంద్రబాబు ప్రభుత్వం ‘మేకి అండ్ అసోసియేట్స్’ను తొలగించి లార్డ్ ఫోస్టర్ నాయకత్వంలోని ‘ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్’ సంస్థకు అమరావతిని డిజైన్‌చేసే కాంట్రాక్ట్‌ను ఎలాంటి టెండర్లు లేకుండా అప్పగించింది. ఇటీవల ఆ సంస్థ సమర్పించిన డిజైన్ల చూసి కూడా చంద్రబాబు పెదవి విరిచారు.
రాజధాని నగరం అంటే బాహుబలి చిత్రంలోని మాహిష్మతి రాజ్యంలా ఉండాలంటూ ఆ చిత్ర దర్శకుడు రాజమౌళిని పిలిపించారు. భారత్‌లోని ఖజూరహో, ఫతేపూర్ సిఖ్రీ, మెక్సికోలోని చిచెన్ ఇట్జా, వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ మిశ్రమమే మాహిష్మతి రాజ్యం సెట్టింగ్ అని తెలిస్తే చంద్రబాబు ఎంత అవాక్కవుతారో!
Advertisement
Advertisement